నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు
బాల్య వివాహాలపై కేసులు నమోదు చేయండి
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు
విశాలాంధ్ర -విజయనగరం : రాష్ట్రంలో ఎవరైనా బాల్య వివాహాలు చేసినా, అనధికారికంగా బాలలను దత్తత తీసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అధికారులను ఆదేశించారు. శనివారం మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయనీ, ఇలా బాల్య వివాహాలు జరగకుండా అధికారులు,అనధికారులు,ప్రజా ప్రతినిదులు,బాలలు తో పనిచేస్తున్న సంస్థలు సంఘాలు నిరంతరం పర్యవేక్షణ చేసి పూర్తి స్థాయిలో నిర్మూలించాలని సూచించారు. బాల్య వివాహాలు చేసిన వారికి పోలీస్ కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బాలలను దత్తత తీసుకున్న వారు ఆ పిల్లలను సక్రమంగా పెంచుతున్నారా? లేదా? అన్నదీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి తనిఖీ చేయాలన్నారు. త్వరలోనే నియోజకవర్గ స్థాయిలో మహిళా సంరక్షణ కార్య దర్శులతో బాలల హక్కుల పరిరక్షణ మరియు చట్టాలు పై సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తొన్నామన్నారు. ఇదిలా ఉండగా ప్రతి సచివాలయంలోను బాలల హక్కులు, బాల్య వివాహాల నిర్మూలన తదితర గోడ పత్రికలను ప్రదర్శించాలన్నారు. ఈ సమావేశంలో బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ జీ.హిమబిందు సభ్యులు భవాని, సుధారాణి పట్నాయక్, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి అల్లు సత్యనారాయణ, సామాజిక పరివర్తన మార్పు సమాచార వ్యవస్థ (ఎస్బీసీసీ) జిల్లా సమన్వయకర్త బి.రామకృష్ణ, శిశుగృహ మేనేజర్ త్రివేణి, లైజన్ ఆఫీసర్ విద్య, వన్ స్టాపర్ మేనేజర్ సాయి విజయలక్ష్మీ, బాలసదన్ గీత, నాగరాజు,సంధ్య,సరస్వతి,వెంకటరావు, గృహహింస కేంద్ర నుంచి మాధవి, చైల్డ్ లైన్ నుంచి దుర్గ తదితరులు పాల్గొన్నారు.