రైతుల అభివృద్దే డిసిఎమ్ఎస్ లక్ష్యం: చైర్ పర్సన్ డాక్టర్ అవనాపు భావన
విశాలాంధ్ర-విజయనగరం : విశ్వవ్యాప్తంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోన్న రోటరీ క్లబ్ ద్వారా భవిష్యత్ లో వ్యవసాయరంగానికి కూడా సహకారం అందించాలని ఉమ్మడి విజయనగరం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్ పర్సన్ డాక్టర్ అవనాపు భావన ఆకాంక్షించారు . విజయనగరం లోని ఓ ప్రైవేట్ హోటల్ లో శనివారం రోటరీ క్లబ్ నిర్వహించిన నేటి జీవనశైలికి రైతుల జీవితాలు మరియు వారి అభ్యున్నతిలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ యొక్క సహకారం, నేటి జీవనశైలి కోసం దంతవైద్యం అనే అంశాలపై మాట్లాడేందుకు ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఉమ్మడి విజయనగరం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్ పర్సన్ గా వ్యవసాయం, రైతుల కోసం మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ కి ముందుగా ధన్యవాదాలు తెలిపారు . నేటి తరంలో రైతుల గురించి, దేశ భవిష్యత్ కోసం వారు కష్టించే విధానం కోసం ఎంత చెప్పినా తక్కువేనని డాక్టర్ అవనాపు భావన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి విజయనగరం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్ పర్సన్ గా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు . తద్వారా డిసిఎమ్ఎస్ లాభాల బాటలో పయనిస్తోందని గత ఏడాది 19 కోట్ల టర్నోవర్ సాదిస్తే ఈ ఏడాది 21 కోట్ల టర్నోవర్ సాధించిందని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. సభ్యుల సహకరంతో ఎన్నో అభివృద్ధి ,సేవ ,ఉపాధి ఇలా అన్ని రకాల కార్యక్రమాలు డిసిఎంఎస్ ద్వారా చేస్తున్నట్లు తెలిపారు .మహిళలకు టెక్స్ టైల్ రంగంలో శిక్షణ ,ఖరీఫ్ సీజన్ లో రైతులకు విత్తనాలు, ఎరువులు అందించడం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు డిసిఎమ్ఎస్ శ్రీకారం చుట్టిందన్నారు. అంతేకాకుండా నేడు డిసిఎమ్ఎస్ ద్వారా రైతులు పండిస్తున్న ఉత్పత్తులను ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు ,పైడితల్లి, పోలమాంబ అమ్మవార్ల దేవస్థాన అన్నదాన సత్రాలకు, అంగన్వాడీలకి పంపిణీ చేస్తున్నామని తెలిపారు . ఇలా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ డిసిఎమ్ఎస్ ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. రోటరీ సభ్యులు కూడా వ్యవసాయరంగం వైపు అడుగులు వేయాలని కోరారు. అంతేకాకుండా ఈ మద్య కాలంలో ప్రతి ఒక్కరిలో దంతాల సమస్య ఎక్కువగా కనిపిస్తోందని, దంతాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు . దంతాల పరిశుభ్రతలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. అదేవిధంగా తాను నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం తన మామ, కీర్తిశేషులు , విజయనగరం మాజీ మున్సిపల్ చైర్మన్ అవనాపు సూరిబాబు, భర్త అవనాపు విక్రమ్, సహకారమే అని భావోద్వేగానికి లోనయ్యారు . రైతుల అభివృద్ధికి సహకారం అందించే గొప్ప అదృష్టాన్ని కలిగించిన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి , తాను ఎల్లపుడూ రుణపడి ఉంటానన్నారు . ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ విజయనగరం ప్రెసిడెంట్ కృష్ణ గోపాల్ అగర్వాల్ , సెక్రెటరీ సాయి మనోజ్ , క్లబ్ సర్వీసెస్ డైరెక్టర్ శంకర్ రెడ్డి , క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.