Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

సఖి గ్రూపుల సహాయంతో సామాజిక చైతన్యం

చిట్టిగురువుల కార్యక్రమం ద్వారా అక్షరాస్యత పెరిగింది
గుడ్‌ గవర్నెన్స్‌ వారోత్సవాల సదస్సులో కలెక్టర్‌ సూర్యకుమారి
విశాలాంధ్ర`విజయనగరం :
జిల్లాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఆచరణలో పెట్టిన సిఖి గ్రూపుల ద్వారా సామాజిక చైతన్యం పెరిగిందని, అదే తరహాలో అమలు చేసిన చిట్టి గురువుల కార్యక్రమం ద్వారా జిల్లాలో అక్షరాస్యత 78 నుంచి 93 శాతానికి పెరిగిందని జిల్లా కలెక్టర్‌ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. ఇదంతా జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అందరూ సమష్టిగా కృషి చేసి సాధించిన విజయమని హర్షం వ్యక్తం చేశారు. గుడ్‌ గవర్నెన్స్‌ వారోత్సవాల్లో భాగంగా స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లా ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో సామాజిక చైతన్యం తీసుకొచ్చేందుకు, అక్షరాస్యత పెంపొందించేందుకు నిర్ణయించిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
సమాజంలో మార్పు, టెక్నాలజీ పేరుతో.. నాగరికత అనే ముసుగులో సంస్కారం కోల్పోతున్నామని అది మంచి పరిణామం కాదని కలెక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చదువుతో పాటు ప్రతి ఒక్కరిలో సంస్కారం పెరగాలని, పెద్దల పట్ల గౌరవం పెరగాలని అప్పుడే నైతిక విజయం సాధించనట్లు అవుతుందని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. గుడ్‌ గవర్నెన్స్‌ విధానంలో భాగంగా ఈ రోజు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా స్థానికంగా సచివాలయాల ద్వారా సేవలందిస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు స్పందన పోర్టల్‌ ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నామని, నిర్ణీత కాలంలో సంతృప్తికర పరిష్కారాలను చూపుతున్నామని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో తెలుసుకున్న అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యే విధంగా వ్యావహారిక భాషలో చెప్పాలని సచివాలయ సిబ్బందిని ఉద్దేశించి కలెక్టర్‌ అన్నారు.
కార్యక్రమంలో భాగంగా గుడ్‌ గవర్నెన్స్‌ లో భాగంగా జిల్లాలో అమలు చేస్తున్న విధానాల గురించి సీపీవో బాలాజీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. దీనిలో భాగంగా సఖి గ్రూపులు, చిట్టిగురువుల కార్యక్రమంపై రూపొందించిన డాక్యుమెంటరీలు ప్రదర్శించారు.
కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె. మయూర్‌ అశోక్‌, వినియోగదారుల కమిషన్‌ జిల్లా ప్రెసిడెంట్‌ ఆర్‌. నాగసుందర్‌, సీపీవో బాలాజీ, సివిల్‌ సప్లై డీఎం మీనాకుమారి, డీఎస్వో మధుసూధనరావు, సచివాలయాల జిల్లా కో-ఆర్డినేటర్‌ అశోక్‌ ఇతర విభాగాల అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img