Friday, March 31, 2023
Friday, March 31, 2023

సమాజంలో రోజురోజుకూ విలువలు పతనమైపోతున్నాయి

డబ్బు, పాశ్చాత్య పోకడల ప్రభావంతో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం
ఆవేదన వ్యక్తం చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ చక్రవర్తి
న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నల్సా మెగా న్యాయ అవగాహన శిబిరం

విశాలాంధ్ర – విజయనగరం క్రైమ్‌ : డబ్బు, పాశ్చాత్య పోకడల ప్రభావంతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిందని, దాని ప్రభావంతో సమాజంలో విలువలు రోజురోజుకూ పతనమైపోతున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్లో నైతిక విలువలు కొరవడుతున్నాయని దీనిపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. సమాజంలో చోటు చేసుకుంటున్న దుష్పరిణామాలు తగ్గాలంటే పటిష్ఠమైన కుటుంబ వ్యవస్థ ఏర్పడాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం న్యాయ సేవా సదన్‌ భవనంలో నల్సా మాడ్యుల్‌ మెగా న్యాయ అవగాహన శిబిరం జరిగింది. సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హెచ్‌.వి. లక్ష్మీ కుమారి సభకు అధ్యక్షత వహించగా.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళల అక్రమ రవాణా, వాణిజ్య లైంగిక దోపడీ, వయోవృద్ధుల రక్షణ వారికి అందుతున్న న్యాయ సేవలపై ప్రసంగించారు.

డబ్బు సంపాదన, ఆస్తులు కూడబెట్టడమే ప్రధానంగా చాలా మంది జీవిస్తున్నారని ఇది సమాజానికి మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలపై పర్యవేక్షణ లోపం ఉంటుందని దీని వల్ల వారిలో నైతిక విలువలు కొరవడుతున్నాయని.. దాని దుష్పరిణామాలు సమాజంపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. పిల్లల్ని పెంచే విధానంలో, చదువు చెప్పే విధానంలో మార్పు రావాలని హితవు పలికారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాజ హితమే లక్ష్యాంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. అన్నీ డబ్బుతోనే జరగవని, మన చుట్టూ ఉన్నవారితో సఖ్యతగా మెలగాలని, ఇతరులకు తోడ్పడాలని హితవు పలికారు. మనం ఎంత డబ్బు సంపాదించినా మనకంటూ కొంతమంది ఆప్తులను సంపాదించుకోలేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుందని ఉపదేశించారు. కర్మ సిద్ధాంతానికి లోబడి అందరూ ఉండాల్సిందేనని, దానిని కాదని తప్పులు చేస్తే జీవితం చరమాంకంలో దాని ఫలితాలు అనుభవించక తప్పదని హెచ్చరించారు. వయసుతో పాటు చోటు చేసుకొనే హార్మోన్ల ప్రభావం గురించి యుక్త వయసుకు వచ్చిన యువతీ, యువకులకు విడమరిచి చెప్పి, వారు దారితప్పకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సూచించారు. మానవుడికి కోరికలు అనంతమని వాటిని అదుపు చేసుకొని ముందుకు సాగినప్పుడే బంగారు భవిష్యత్తు లభిస్తుందని.. లేదంటే అథఃపాతాళానికి పోతారని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. బెంగుళూరులో ఒక విద్యా సంస్థలో చదివే విద్యార్థుల బ్యాగుల్లో సిగరెట్లు, కండోమ్‌లు, ఇతర హానికర వస్తువులు లభించటం, యుక్త వయసుకు వచ్చిన యువతులను పరాయి దేశాలకు తరలిస్తున్న ఘటనలు తనని కలిచివేశాయని ప్రధాన న్యాయమూర్తి విచారం వ్యక్తం చేశారు. బాధితులకు చట్టాలు ఎప్పుడూ అండగా నిలుస్తాయని భరోసా ఇచ్చారు.

ఏఏ జిల్లా కోర్టు ఒకటో అదనపు న్యాయమూర్తి కె. రాధారత్నం మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూచించారు. వయోవృద్ధులకు, పిల్లలకు అనేక మార్గాల్లో అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందారు. మన చుట్టూ ఉండేవాళ్లలోనే మనకి శత్రువులు ఉంటున్నారని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రేమ అనే ఉచ్చులో పడి పిల్లలు వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఏఏ జిల్లా కోర్డు నాలుగో అదనపు న్యాయమూర్తి షేక్‌ సికిందర్‌ భాషా మాట్లాడుతూ సమాజ స్థితిగతులను అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ జీవించాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గిఫ్ట్‌ డీడ్‌లు రాసేటప్పుడు జాగ్రత్తగా వహించాలని.. అలా రాసినప్పటికీ పిల్లల నుంచి అపాయం ఉందని భావిస్తే దాన్ని తిరిగి తీసుకోవచ్చని, దీనికి చట్టం ఒప్పుకుంటుందని పేర్కొన్నారు. రివర్స్‌ మార్ట్‌ గేజ్‌ విధాన సౌలభ్యాన్ని వినియోగించుకొని వయో వృద్ధులు లబ్ధి పొందవచ్చని సూచించారు. చట్టాలు చాలా బలంగా పని చేస్తాయని బాధిత వర్గాలకు ఎప్పుడూ తోడుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఏఏ వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జగదీష్‌ బాబు, సీడబ్ల్యుసీ ఛైర్‌ పర్శన్‌ హిమబిందు మహిళలకు, వృద్ధులకు జరుగుతున్న అన్యాయాలు, న్యాయ సేవలపై మాట్లాడారు. పిల్లలు ప్రేమ అనే మోజులో పడి జీవితాలను చెడగొట్టుకుంటున్నారని హిమబిందు ఆవేదన వ్యక్తం చేశారు. వయో వృద్ధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న పథకాలు, సేవలపై వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ జగదీష్‌ వివరించారు. దిశా యాప్‌ వినియోగాలు, దిశ పోలీస్‌ స్టేషన్‌ ద్వారా అందుతున్న సేవల గురించి దిశా పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌.ఐ. లక్ష్మి వివరించారు. ఫోన్‌ పోగొట్టుకున్నట్లయితే 89779 45606 ఫోన్‌ నంబరును సంప్రదించి సాయం పొందవచ్చని సూచించారు. ఎల్డర్‌ లైన్‌ స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ వృద్ధుల సౌకర్యార్థం 14567 టోల్‌ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఏ సహాయం కావాలన్నా సంప్రదించాలని చెప్పారు. అనంతరం సంబంధిత పోస్టర్‌ ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల చేతుల మీదుగా ప్రారంభించారు.

స్టాళ్లలో వస్తు ప్రదర్శన.. వైద్య శిబిరం

మెగా న్యాయ అవగాహన శిబిరంలో భాగంగా న్యాయ సేవా సదన్‌ భవనంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ, మెప్మా, సమాఖ్య సభ్యులు తయారు చేసిన వస్తువులు, చేనేత వస్త్రాలను ప్రదర్శనలో ఉంచారు. శిబిరానికి వచ్చిన వారి సౌకర్యార్థం వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు.

సదస్సులో సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హెచ్‌.వి. లక్ష్మీకుమారి, ఇతర న్యాయ ప్రముఖులు, న్యాయవాదులు, వయో వృద్ధులు, వివిధ సంస్థల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img