Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అత్యాచారకేసులో ముద్దాయికి జీవిత ఖైదు

13నెలల వ్యవధిలో శిక్షను ఖరారుచేసిన స్పెషల్ ఫోక్సో కోర్టు
వివరాలను వెల్లడించిన మన్యంజిల్లా ఎస్పీ

విశాలాంధ్ర-పార్వతీపురం: గత ఏడాది జనవరి 1న ఇద్దరు గిరిజన బాలికలమీద కురుపాందగ్గర రావాడదరి పామాయల్ తోటలో అత్యాచారం జరిగిన నేరంపై కురుపాం పోలీస్ స్టేషన్లో నమోదయిన కేసులో ముద్దాయి వెలగాడ రాంబాబుకు జిల్లా స్పెషల్ ఫోక్సో కోర్టు జీవితఖైదు శిక్షను విధిస్తూ మంగళవారం తీర్పును వెలువరించిందని పార్వతీపురం మన్యంజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన చాంబర్లో విలేకరుల సమావేశంను నిర్వహించి వివరాలు వెల్లడించారు. కురుపాం పోలీస్ స్టేషన్లో క్రైం నంబరు 1/22 అండర్ సెక్షన్ 376, 341, 419, 384, ఐపిసి అండ్ సెక్షన్ 4 ఆఫ్ కేసులో ముద్దాయి అయిన వెలగాడ రాంబాబు కేసులో జిల్లా స్పెషల్ ఫోక్సో కోర్టు ,విజయనగరం ముద్దాయిపైఉన్న ఒక్కో సెక్షన్ ను విచారించి సెక్షన్ 341 ఐ.పి.సి కి ఒకనెల జైలుశిక్ష, రూ.500 లు జరిమానా, సెక్షన్ 384 ఐ.పి.సి కి మూడు సంవత్సరములు జైలుశిక్ష, రూ.1000 లు జరిమానా, సెక్షన్ 419 ఐ.పి.సి కి మూడు సంవత్సరములు జైలుశిక్ష, రూ. 1000 లు జరిమానా, సెక్షన్ 506 (2) ఐ.పి.సి కి మూడు సంవత్సరములు జైలుశిక్ష, రూ. 1000 లు జరిమానా, సెక్షన్ 376 ఐ.పి.సి అండ్ సెక్షన్ 4 ఆఫ్ ఫోక్సో యాక్టులో జీవిత ఖైదు, రూ.20,000/-లు జరిమానా విధిస్తూ స్పెషల్ ఫోక్సో కోర్టు ఇంచార్జి జడ్జి షేక్ సికిందర్ భాషా మంగళవారం తీర్పువెలువరించారని తెలిపారు. ఈకేసులో బాధితుల ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున ఇద్దరికి రూ.10లక్షల నష్టపరిహారం అందించాల్సిందిగా తీర్పు వెలువరించారని తెలిపారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. శంకరరావు ప్రభుత్వంతరపున కేసును వాదించారు. ఈకేసును అప్పటి ఉమ్మడిజిల్లా ఎస్పీ దీపిక పాటిల్ ఆదేశాలు మేరకు బాదితులతరుపున కేసును వెంటనే నమోదు చేశారని చెప్పారు. ఎల్విన్ పేట సిఐ టి.వి. తిరుపతిరావు, కురుపాం ఎస్ఐ ప్రసాద్, హోంగార్డు ఉమాలు కేసు దర్యాప్తును ముమ్మరంగాచేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు కావాల్సిన సమచారం నిర్ణీత సమయంలో అందజేయడంతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయాధికారుల ప్రత్యేకశ్రద్ధతో త్వరితగతిన తీర్పుప్రకటన జరిగిందని తెలిపారు. ముద్దాయి రాంబాబుపై మన్యం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో 24కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ 4న జిల్లాఆవిర్భావం తరువాత నేరాలపై ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ చెప్పారు. మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు ఇటువంటి తీర్పులు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు అదనపు ఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్, పాలకొండ డి.ఎస్పీ జివి కృష్ణారావు, ఎల్బిన్ పేట సీఐ పి.సత్యనారాయణ, ఎస్బి సీఐ శ్రీనివాస రావు , డి సి ఆర్ బి సీఐ ఎన్వీ ప్రసాదరావు, కురుపాం,పాలకొండ ఎస్ఐలు ప్రసాద్, శివప్రసాద్, పోలిస్ రామునాయుడు, హోంగార్డు ఉమాతదితరులు పాల్గొన్నారు. ఈకేసును దర్యాప్తుచేసి ముద్దాయికి శిక్ష పడేలా తగు ఆధారాలు కోర్టుకు అందించిన సీఐ, ఎస్ఐ, పోలిస్ సిబ్బంది, హోంగార్డులను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ లు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img