Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

అన్ని శాఖల సమన్వయం తో రహదారి భద్రతా వారోత్సవాలు

వాహనాల పై ఓవర్ లోడింగ్ నిరోధించాలి
జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విశాలాంధ్ర – విజయనగరం : ఈ నెల 18 నుండి 24 వరకు నిర్వహించనున్న రహదారి భద్రతా వారోత్సవాల్లో ప్రభుత్వ శాఖలన్న పాల్గొని ప్రమాదాల నివారణకు వారి సలహాలను, సూచనలను అందించాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశించారు. రహదారి ప్రమాదాలను తగ్గించడానికి శాఖల మధ్య సమన్వయం చాల అవసరమని అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా రహదారి భద్రతా కమిటి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఆర్.టి.సి బస్సు లను రహదారి పై ఎక్కడబడితే అక్కడ ఆప కుండా నిర్దేశించిన స్టాప్ లలోనే ఆపేలా చూడాలని ఆదేశించారు. రైతు బజార్ల ముందు రహదార్ల పై దుకాణాలు అధిక సంఖ్య లో వెలుస్తున్నాయని, వాటిని నిరోధించాలని తెలిపారు. రాదారి భద్రత పై పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యా శాఖ ద్వార అవగాహనా తరగతులను నిర్వహించాలన్నారు. ఈ వారోత్సవాల్లో రహదారి గుర్తులు, భద్రత పై విద్యార్ధులకు క్విజ్ , వ్యాసరచన తదితర పోటీలను నిర్వహించాలన్నారు. వీలైతే సిలబస్ లో చేర్చి వారానికి ఒక తరగతి నిర్వహించాలని తెలిపారు. భోగాపురం హై వే పై పశువుల సంచారం , పాద చారుల క్రాసింగ్ వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీస్ అధికారులు కలెక్టర్ దృష్టి కి తెచ్చారు. వాటిని నిరోధింహడానికి చుట్టూ ప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలతో, సర్పంచ్ లతో సమావేశాలు నిర్వహించి అవగాహనా కలిగించాలని కలెక్టర్ సూచించారు. పోలిస్, జాతీయ రహదారుల శాఖ వారు సంయుక్తంగా తనిఖీ చేసి అవసరమగు చర్యలు చేపట్టాలని తెలిపారు. వాహనాల పై ఓవర్ లోడ్ వలన, అధిక బరువు వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఒకరిద్దరికి అపరాధ రుసుం వేస్తే ఓవర్ లోడింగ్ తగ్గించవచ్చని అన్నారు. అదే విధంగా హెల్మెట్ వాడకాన్ని కూడా ప్రోత్సహించాలని, పోలీస్, రవాణా శాఖ లే కాకుండా రెవిన్యూ ఇతర శాఖలు కూడా బాధ్యత తీసుకోవాలని అన్నారు. జిల్లా ఎస్.పి దీపిక పాటిల్ మాట్లాడుతూ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన, మరణించిన వారి ఫోటోలను, వాహనాలను రహదారి కూడళ్ళలో ప్రదర్శించాలని, వాటిని చూసే వారికీ భయం, బాధ్యత కలుగుతాయని అన్నారు.
ఈ సమావేశం లో రవాణా శాఖ ఉప కమీషనర్ సుందర్, జిల్లా ఆరోగ్య అధికారి డా. రమణ కుమారి, డి.సి.హెచ్.ఎస్. డా. గౌరీ శంకర్, ట్రాఫిక్ డి.ఎస్.పి ఎల్. మోహన రావు, డి.ఈ.ఓ లింగేశ్వర రెడ్డి , ఆర్.టి.సి , ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img