Friday, April 19, 2024
Friday, April 19, 2024

జనవరి 26 నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధం

ముద్రించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవు
అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ సూర్యకుమారి హెచ్చరిక

విశాలాంధ్ర – విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జిల్లాలో జనవరి 26 నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల వినియోగాన్ని నిషేధించాలని సంబంధిత విభాగాల అధికారులను జిల్లా కలెక్టర్‌ ఎ. సూర్యకుమారి ఆదేశించారు. పర్యావరణ హానికర ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు అన్ని విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని, నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం, ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధం గురించి అనుసరించాల్సిన విధానాలపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం తన ఛాంబర్లో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. పలు సూచనలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.75, 522లలో పేర్కొన్న నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని, అమలు చేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి జనవరి 26 నుంచి జిల్లాలో ఎక్కడా కూడా ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు, హోర్టింగ్‌లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల స్థానంలో పర్యావరణ హితమైన క్లాత్‌ బ్యానర్లను వినియోగించుకోవాలని, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసినా, విక్రయించినా జరిమానాలు విధించాలని చెప్పారు. మొదటి తప్పుగా రూ.50 వేలు, రెండో సారి తప్పు చేస్తే రూ.లక్ష జరిమానాతో పాటు సంబంధిత పరిశ్రమ లేదా షాప్‌ను సీజ్‌ చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. శుభకార్యాలు, పబ్లిక్‌ మీటింగ్‌లు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాల్లో ప్లాస్టిక్‌ బ్యానర్లను ప్రదర్శించరాదని, తయారు చేయరాదని, ఇతర ప్రాంతాలకు తరలించరాదని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీల పరిధిలో మరింత పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు.

వాయు కాలుష్యం లేకుండా ప్రమాణాలు పాటించాలి

జిల్లాలోని పట్టణాల పరిధిలో గాలి నాణ్యతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ, మున్సిపల్‌ విభాగ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గురువారం జరిగిన సమావేశంలో వాయు కాలుష్యం లేకుండా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. కేంద్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు రూపొందించిన విధివిధానాలను తప్పకుండా పాటించాలని పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే పొగ ద్వారా గాలి నాణ్యతను పరిశీలించాలని, వాయు కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్లు, పట్టణ ఆరోగ్య అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.

సమావేశంలో కాలుష్య నియంత్రణ విభాగం ఈఈ సుదర్శన్‌, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ పాపారావు, మున్సిపాలిటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రసాదరావు, ఆర్టీవో ఆదినారాయణ, ఇతర విభాగాల జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, ప్లాస్టిక్‌ తయారీ అసోసియేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img