Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ధాన్యం కొనుగోలులో మ‌రింత పురోగ‌తి సాధించాలి

అధికారుల‌ను ఆదేశించిన‌ జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్

విశాలాంధ్ర – విజ‌య‌న‌గ‌రం: జిల్లాలో కొన‌సాగుతున్న ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌లో మ‌రింత పురోగ‌తి సాధించాల‌ని, ఆ దిశ‌గా సంబంధిత శాఖ‌ల అధికారులంద‌రూ స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మయూర్ అశోక్ ఆదేశించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 2.42 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు జ‌రగ‌టం హ‌ర్ష‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు. అయితే అక్క‌డ‌క్క‌డా చిన్న‌చిన్న స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ని.. వాటిని ప‌రిష్క‌రించి మ‌రింత పురోగ‌తి సాధించాల‌ని నిర్దేశించారు. ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ, ఇత‌ర‌ అంశాల‌పై బుధ‌వారం త‌న ఛాంబ‌ర్లో వివిధ విభాగాల అధికారుల‌తో ఆయ‌న‌ స‌మీక్షించారు.

కొనుగోలు ప్ర‌క్రియ పూర్త‌యిన తర్వాత స‌మీపంలో ఉన్న మిల్లుల‌కు ధాన్యం చేరుకొనేలా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, స‌రిప‌డా వాహ‌నాల‌ను అందుబాటులో ఉంచాల‌ని చెప్పారు. ఎక్క‌డా అవ‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వ‌ర‌కు పూర్తి ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. మిల్లుల‌కు చేరిన వాహ‌నాల తాలూక ట్రక్ షీట్ల జాబితాల‌ను ప‌రిశీలించుకోవాల‌ని, వారి నుంచి ర‌సీదు తీసుకోవాల‌ని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాల మేర‌కు ధాన్యం సేక‌రించేలా మండ‌ల‌, గ్రామ స్థాయి సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేయాల‌ని జిల్లా స్థాయి అధికారులకు సూచించారు. త‌క్కువ సేక‌ర‌ణ జ‌రిగిన చోట్ల ప్ర‌త్యేక దృష్టి సారించి ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని చెప్పారు. ధాన్యం, ర‌వాణా భ‌త్యానికి సంబంధించిన బిల్లుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లించాల‌ని పేర్కొన్నారు. అలాగే కాల్ సెంట‌ర్ ద్వారా మ‌రిన్ని మెరుగైన సేవ‌లందించాల‌ని జేసీ సూచించారు. అధికారులు క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ ఆర్‌.బి.కె.ల‌ను, మిల్లుల‌ను త‌నిఖీ చేయాల‌ని చెప్పారు. స‌మావేశంలో సివిల్ స‌ప్లై డీఎం మీనాకుమారి, డీఎస్వో సుద‌ర్శన్ రావు, జిల్లా వ్య‌వసాయ అధికారి త్రినాథ స్వామి, హార్టిక‌ల్చ‌ర్ డీడీ జ‌మ‌ద‌గ్ని, ర‌వాణా శాఖ ఉప క‌మిష‌న‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img