Friday, April 19, 2024
Friday, April 19, 2024

పోలింగ్ కేంద్రాల‌ను సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్‌

మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని ఆదేశం

విశాలాంధ్ర-విజ‌య‌న‌గ‌రం : ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల శాస‌న‌మండ‌లి స్థానం కోసం ఈ నెల 13న జ‌ర‌గ‌నున్నఎన్నికల‌ ప్ర‌క్రియ‌లో భాగంగా, ప‌ట్ట‌ణంలోని పోలింగ్ కేంద్రాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి బుధ‌వారం సందర్శించారు. జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్‌తో క‌లిసి, ఆమె ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేశారు. జోన‌ల్‌, పోలింగ్ అధికారుల‌కు ప‌లు ఆదేశాల‌ను జారీ చేశారు. విజ‌య‌న‌గ‌రం కంటోన్మెంటులోని మున్సిప‌ల్ ఉన్న‌త పాఠ‌శాల‌, మ‌హారాజా క‌ళాశాల‌, క‌స్పా మున్సిప‌ల్ ఉన్న‌త పాఠ‌శాల‌, మ‌హారాజా సంస్కృత ఉన్న‌త పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి, పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించారు.

             ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, అన్ని పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు త‌దిత‌ర క‌నీస మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని ఆదేశించారు. క్యూలైన్ల ప్ర‌క్క‌నే కుండ‌ల‌తో నీటిని ఉంచాల‌న్నారు. కేంద్రాల్లో లైట్లు, ఫ్యాన్లు అన్నీ ప‌నిచేసేలా చూడాల‌న్నారు. ఎండ తీవ్రంగా ఉండటం వ‌ల్ల‌, నీడ‌కోసం షామియానాలు వేయాల‌న్నారు. ఓట‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు  క్యూలైన్ల ప్ర‌క్కన న‌మూనా బ్యాలెట్ ప‌త్రాల‌ను అంటించాల‌ని సూచించారు. ప్ర‌తీ పోలింగ్ బూత్‌కు వేర్వేరు క్యూలైన్ల‌ను ఉండాల‌ని, అందుకు త‌గిన‌ట్టుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. ఓట‌ర్లు ఇబ్బంది ప‌డ‌కుండా, ఓటింగ్ ప్ర‌క్రియ వేగంగా జ‌రిగేందుకు అవ‌స‌మైన అన్నిర‌కాల చ‌ర్య‌ల‌నూ తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల‌వ‌ద్ద ప‌టిష్ట‌మైన బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఎస్‌పి దీపికా పాటిల్ చెప్పారు.

ఓట‌ర్ స్లిప్పుల పంపిణీ త్వ‌ర‌గా పూర్తి చేయాలి
గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల‌కు ఓట‌ర్ స్లిప్పుల పంపిణీ త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని, బిఎల్ఓల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ప్ర‌తీ పోలింగ్ కేంద్రంలో, ఓట‌ర్ స్లిప్పుల పంపిణీపై బిఎల్ఓల‌ను ఆరా తీశారు. త‌క్కువ స్లిప్పుల‌ను పంపిణీ చేసిన‌వారిపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. పంపిణీ శత‌శాతం జ‌ర‌గాల‌ని, స్వ‌యంగా వెళ్లి స్లిప్పుల‌ను ఓట‌ర్ల‌కు అంద‌జేయాల‌ని సూచించారు. ఓట‌ర్ స్లిప్పుల పంపిణీలో, ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో వ‌లంటీర్ల‌ను ఎట్టిప‌రిస్థితిలోనూ వినియోగించ‌రాద‌ని క‌లెక్ట‌ర్‌ స్ప‌ష్టం చేశారు.

            ఈ ప‌ర్య‌ట‌న‌లో  జోన‌ల్ ఎన్నిక‌ల అధికారులు పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, బి.రాంగోపాల్‌, విజ‌య‌న‌గ‌రం డిఎస్‌పి శ్రీ‌నివాస‌రావు, తాశిల్దార్ బంగార్రాజు, ఇత‌ర రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img