Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రూ. 787.02 కోట్లతో జిల్లాపరిషత్‌ అంచనా బడ్జెట్‌

ప్రస్తుత ఏడాది రూ.767.89 కోట్లతో సవరణ బడ్జెట్‌ కు ఆమోదం
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ః ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

విశాలాంధ్ర`విజయనగరం : అన్ని వర్గాల సంక్షేమానికి, అభివృద్దికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ప్రజాపరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. అన్ని శాఖలకు కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.767.89 కోట్ల ఖర్చుతో సవరణ బడ్జెట్‌కు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 787.02 కోట్లతో అంచనా బడ్జెట్‌కు జిల్లా ప్రజాపరిషత్‌ ఆమోదం తెలిపింది. దీనిలో ప్రత్యేకంగా జిల్లా పరిషత్‌ ద్వారా చేసే ఖర్చులకు సంబంధించి రూ.13 కోట్ల, 30లక్షల, 79వేల, 860 ఖర్చుతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్‌ను ఆమోదించారు. అదేవిధంగా 34 మండల పరిషత్‌ బడ్జెట్‌లను కూడా ఈ సమావేశంలో ఆమోదించారు. ఛైర్‌పర్సన్‌ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా పరిషత్‌ బడ్జెట్‌ సమావేశం, 1వ స్థాయి సంఘ సమావేశం జెడ్‌పి సమావేశ మందిరంలో శనివారం జరిగింది. ముందుగా ఛైర్మెన్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ జెడ్‌పి బడ్జెట్‌ విశేషాలను వివరించారు. జిల్లా జనాభా ఆధారంగా ప్రభుత్వం నిధులను కేటాయించడం జరుగుతుందని చెప్పారు. జెడ్‌పి బడ్జెట్‌ నుంచి ఎస్‌సిల సంక్షేమం కోసం 15 శాతం, ఎస్‌టిలకు 6 శాతం, స్త్రీ శిశు సంక్షేమానికి 15 శాతం, అభివృద్ది పనులకు 23 శాతం, గ్రామీణ మంచినీటి సరఫరాకు 12 శాతం, కార్యాలయ నిర్వహణకు 15 శాతం, వివిధ శాఖల కార్యకలాపాలకు 10 శాతం ఆగంతక ఖర్చులకు 4 శాతం నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కల్యాణమస్తు, జలజీవన్‌ మిషన్‌ పనులపై సమీక్షించారు. త్వరగా టెండర్లు పిలిచి, జెజెఎం పనులను పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు పథకానికి విస్తృత ప్రచారం చేయాలని సభ్యులకు ఛైర్మన్‌ విజ్ఞప్తి చేశారు. జెడ్‌పి డిప్యుటీ సిఈఓ కె.రాజ్‌కుమార్‌ బడ్జెట్‌ స్వరూపాన్ని సభకు వివరించారు. ఈ సమావేశంలో ఎంఎల్‌సి ఇందుకూరి రఘురాజు, జెడ్‌పిటిసి సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img