Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విజ‌య‌న‌గ‌రంలో 50 వేల మందితో మాన‌వ‌హారం

ర్యాలీగా సాగి గౌర‌వ వంద‌నం స్వీక‌రించిన క‌లెక్ట‌ర్, ఎస్పీ

విశాలాంధ్ర – విజ‌య‌న‌గ‌రం : అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని విజ‌య‌న‌గ‌రంలో 50 వేల మందితో నిర్వ‌హించిన మానవ‌హారం స‌మైక్య స్ఫూర్తిని చాటి చెప్పింది. సాంఘిక దురాచారాల‌ను రూపుమాపుదాం.. రేప‌టి త‌రాన్ని కాపాడుదాం.., బాల్య వివాహాలు వ‌ద్దు.. బంగారు భ‌విష్య‌త్తే ముద్దు.., బాలికా ర‌క్ష‌ణే.. భార‌త ర‌క్ష‌ణ అనే ప‌లు ర‌కాల‌ నినాదాల‌తో న‌గ‌రమంతా మారుమోగిపోయింది. వివిధ‌ పాఠ‌శాల‌ల‌కు చెందిన వేలాది మంది విద్యార్థులు, స‌మాఖ్య సంఘాల స‌భ్యులు, స‌చివాల‌యాల మ‌హిళా ఉద్యోగులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యక‌ర్త‌లు త‌దిత‌రులు న‌గ‌రమంతా మాన‌వ‌హారంగా ఏర్ప‌డి నినాదాలు చేశారు. జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి, ఎస్పీ దీపికా ఎం. పాటిల్‌ ఓపెన్ టాప్ వాహ‌నంపై ర్యాలీగా సాగి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. వారితో పాటు జేసీ కె. మ‌యూర్ అశోక్ భాగస్వామ్య‌మ‌య్యారు.

మాన‌వ‌హారం, ర్యాలీ క‌లెక్ట‌రేట్ స‌మీపంలోని పూలే కూడ‌లి నుంచి ఎస్పీ కార్యాల‌యం, ఆర్ డ బి జంక్ష‌న్‌, ఆర్టీసీ కాంప్లెక్సు, బాలాజీ జంక్ష‌న్‌, ధ‌ర్మ‌పురి జంక్ష‌న్‌, పోర్ట్ స్కూల్ జంక్ష‌న్‌, దాస‌న్న‌పేట రైతు బ‌జారు, అయ్య కోనేరు, కోట జంక్ష‌న్‌, సింహాచ‌లం మేడ మీదుగా ఆనంద గ‌జ‌ప‌తి ఆడిటోరియం వ‌ర‌కు పెద్ద ఎత్తున సాగింది. దిశ పోలీసు సిబ్బంది, డీఆర్డీఏ, ఐసీడీఎస్‌, మెప్మా, వైద్యారోగ్య సిబ్బంది, సచివాల‌య సిబ్బంది, మున్సిప‌ల్ సిబ్బంది, అధికారులు ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్య‌మ‌య్యారు. ర్యాలీ అనంత‌రం ఆడిటోరియం ప్రాంగ‌ణంలో తెలుగుత‌ల్లి విగ్ర‌హానికి క‌లెక్ట‌ర్, ఎస్పీ, జేసీ తదిత‌రులు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

ఆడ పిల్ల‌ల‌కు బంగారు భ‌విష్య‌త్తును ప్ర‌సాదిద్దాం

ర్యాలీ అనంత‌రం మీడియాతో మాట్లాడిన జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి సాంఘిక దురాచారాల‌ను పార‌ద్రోలుదామ‌ని.. స‌రికొత్త స‌మాజాన్ని నిర్మిద్దామ‌ని పిలుపునిచ్చారు. ఆడ పిల్ల‌ల‌ను బాగా చ‌దువుకోనివ్వ‌టం ద్వారా బంగారు భ‌విష్య‌త్తును ప్ర‌సాదించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. వివాహానికి తొంద‌ర లేద‌ని.. వారిని బాగా చ‌దువుకోనివ్వాల‌ని హిత‌వు ప‌లికారు. టీనేజీ ప్రెగ్నెన్సీని పూర్తిగా వ్యతిరేకించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని పేర్కొన్నారు. 50 వేల మందితో 10 కి.మీ. మేర సాగిన మానవహారం.. ఐక్యతకు నిదర్శనమని ఉద్ఘాటించారు. మానవహారం, ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ధన్యవాదాలు తెలిపారు. ర్యాలీ సాఫిగా సాగేందుకు పోలీసులు ట్రాఫిక్‌ను క్ర‌మబ‌ద్దీక‌రించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img