Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విద్యపై ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి

ఉపాధి కల్పనా కోర్సులకు అధిక ప్రాధాన్యత
రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ
జెఎన్‌టియులో నూతన భవనాలకు శంకుస్థాపన

విశాలాంధ్ర – విజయనగరం టౌన్‌ : విద్యకోసం ప్రభుత్వం చేసే ఖర్చు, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అందువల్లే విద్యకోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేయడానికైనా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. స్థానిక జెఎన్‌టియు గురజాడ విశ్వవిద్యాలయంలో రూ.11కోట్లతో నిర్మించనున్న పరీక్షా కేంద్రానికి, రూ.8కోట్లతో నిర్మించనున్న సమావేశ మందిరానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కు సంబధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి బొత్స మాట్లాడుతూ, విద్య, వైద్యం, వ్యవసాయానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలను విద్యకోసం వెచ్చించడం జరిగిందని, ఇది మానవ వనరులకోసం పెట్టిన పెట్టుబడి అని చెప్పారు. ప్రాధమిక విద్యతోపాటు, ఉన్నత విద్యకు కూడా సమాన ప్రాధాన్యత కల్పించామన్నారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేవిధంగా అత్యున్నత శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. చదువు పూర్తి కాగానే ఉపాధి కల్పించే కోర్సులకు, నైపుణ్య శిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నైపుణ్యం గల మానవ వనరులకోసం ఎన్నో దేశాలు మన రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. సుమారు 30వేల మంది నర్సులు కావాలని, జర్మనీకి చెందిన ఒక సంస్థ ఇటీవలే రాష్ట్రానికి వచ్చిందన్నారు. దాదాపు 89వేల మందికి మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇచ్చి, సాఫ్ట్‌ వేర్‌ నిపుణులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. 26వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు సింగపూర్‌కు చెందిన కంపెనీతో ఒప్పందం జరిగిందని చెప్పారు.ఏ విద్యార్థికైనా అంకితభావం, చిత్తశుద్ది ఉంటే ఉన్నత స్థానాన్ని సాధించవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు 105 ఎకరాల్లో జిల్లాలో జెఎన్‌టియు విద్యాసంస్థను స్థాపించడం జరిగిందన్నారు. ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి హాయాంలో ఇది విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు. జెఎన్‌టియును అభివృద్ది చేయడం ఒక బాధ్యతగా భావించి, తన కర్తవ్యాన్ని నిర్వహించానని చెప్పారు. కురుపాంలో రూ.150 కోట్లతో నిర్మిస్తున్న గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాలలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. దీనిలో గిరిజనులకు కొంత కోటా కేటాయించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ విద్యార్థీ, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, దానిని సాధించేందుకు కృషి చేయాలని మంత్రి కోరారు.విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, విద్యకు, కళలకు ఎంతో పేరుపొందిన విజయనగరంలో ఏర్పాటు చేసిన జెఎన్‌టియు విశ్వవిద్యాలయం కూడా, దేశంలోనే గొప్ప విద్యాసంస్థగా గుర్తింపు పొందుతుందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకం ద్వారా, సామాన్య కుటుంబాలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు డాక్టర్‌, ఇంజనీరింగ్‌ చదువులు చదువుకున్నారని అన్నారు. ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్‌ మోహనరెడ్డి మరిన్ని అడుగులు ముందుకు వేసి, గతం కంటే ఎక్కువగా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. జెఎన్‌టియులో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు టైమ్‌ స్కేల్‌ను వర్తింపజేయాలని మంత్రిని కోరారు. జెఎన్‌టియుజివి వైస్‌ ఛాన్సలర్‌ జివిఆర్‌ ప్రసాదరాజు, ఛీఫ్‌ ఇంజనీర్‌ వి.శ్రీనివాసులు, రిజిష్ట్రార్‌ జి.స్వామినాయుడు, వైస్‌ ప్రిన్సిపాల్‌ గురునాధ్‌ మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి డాక్టర్‌ పి.సూర్యనారాయణరాజు, రాజాం ఎంఎల్‌ఏ కంబాల జోగులు, ఆర్‌డిఓ ఎంవి సూర్యకళ, జెఎన్‌టియుజివి డైరెక్టర్‌ జయసింహ, ప్రిన్సిపాల్‌ శ్రీకుమార్‌, వివిధ విభాగాల ప్రొఫెసర్లు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img