Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వృత్తిని ఆస్వాదిస్తూ ఉత్తమ సేవలందించండి

మెడికల్‌ ఆఫీసర్లకు జిల్లా కలెక్టర్‌ ఎ. సూర్యకుమారి సూచన
వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యులకు ఓరియంటేషన్‌ ప్రోగ్రాం
విశాలాంధ్ర – విజయనగరం :
వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని.. ఆ వృత్తిని ఆస్వాదిస్తూ ప్రజలకు మెరుగైన రీతిలో సేవలందించాలని మెడికల్‌ ఆఫీసర్లను ఉద్దేశించి జిల్లా కలెక్టర్‌ ఎ. సూర్యకుమారి అన్నారు. చక్కటి చిరునవ్వుతో పలకరించటం ద్వారా రోగుల మనసును తేలిక చేయాలని తర్వాత చికిత్స అందజేయాలని హితవు పలికారు. వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకొనేలా ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఇటీవల నియమితులైన మెడికల్‌ ఆఫీసర్ల నిమిత్తం స్థానిక డీఎం %డ% హెచ్‌వో కార్యాలయంలో మంగళవారం ఒన్‌ డే ఓరియంటేషన్‌ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ సూర్యకుమారి వైద్యులను ఉద్దేశించి మాట్లాడారు. పనిని భారంగా కాకుండా ఇష్టంగా చేయాలని, పేద ప్రజలకు వైద్యపరమైన సేవలందించటం అదృష్టంగా భావించాలని.. మనసుకు సంతృప్తి కలిగేలా పని చేయాలని పేర్కొన్నారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి ముఖ్యంగా సమయపాలన, ప్రశాంతత అవసరమని వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ప్రజలతో ప్రేమ పూర్వకంగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకోవాలని, మెరుగైన రీతిలో చికిత్స అందజేయాలని చెప్పారు. సాధ్యమైనంత మేరకు చిన్నచిన్న కేసులను రిఫరల్‌ చేయొద్దని సూచించారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, ప్రజలు, ఇతర విభాగాల అధికారులు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసుకొని ముందుకెళ్లాలని కలెక్టర్‌ సూచించారు. స్థానిక పరిస్థితులు, వాతవరణాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. చేసిన పనికి సంబంధించిన నివేదికలు సమర్పించేటప్పుడు సాంకేతిక తప్పిదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్రజలకు సేవలందించే అవకాశం రావటం అదృష్టంగా భావించాలని వైద్యులకు సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఉత్తమ సేవలందించాలని హితవు పలికారు.కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డా. ఎస్‌.వి. రమణ కుమారి, జిల్లా మలేరియా అధికారిణి డా. తులసి, ఇతర వైద్యులు, డెమో సెక్షన్‌ అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో మెడికల్‌ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img