Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సేంద్రీయ ఉత్పత్తులకు మంచి రోజులు వచ్చాయి

విశాలాంధ్ర – విజయనగరం : సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేసే పంట ఉత్పత్తులకు మంచి మార్కెట్‌ పరిస్థితులు ఉన్నాయని, వాటి వినియోగం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందని జిల్లా కలెక్టర్‌ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. ఆధునిక పద్ధతులను అవలంబించి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే విధంగా సేంద్రీయ సాగు వైపు రైతు సోదరులు మళ్లాలని పిలుపునిచ్చారు. మార్కెట్‌ బాగున్న పంటలను సాగు చేయాలని ఆర్థిక ప్రయోజనాలను పొందాలని సూచించారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో శుక్రవారం నిర్వహించిన కిసాన్‌ మేళాను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన పలు వ్యవసాయ ఉత్పత్తుల, పరికరాల స్టాళ్లను ముందుగా సందర్శించారు. నూతన వంగడాల దిగుబడి ఫలాలను, ఎరువుల వినియోగం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలో అవలంబించిన ఆధునిక పద్ధతుల ఫలితంగా దిగుబడులు పెరిగాయని, నవధాన్యాలు, చిరుధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల బాగా కనిపించిందని పేర్కొన్నారు. ఇలాంటి కిసాన్‌ మేళాలలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్బంగా సూచించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పరికరాలను, ఎరువులను, వంగడాలను ప్రదర్శించటం హర్షణీయమని అన్నారు. ఈ రోజు చూసిన దాన్ని బట్టి రసాయనిక ఎరువుల వినియోగం తగ్గటం.. సేంద్రీయ పద్ధతుల్లో సాగు పెరగటం కనిపించిందని పేర్కొన్నారు. వివిధ కంపెనీలు కూడా సేంద్రీయ పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పాఉ. ఇది చాలా శుభపరిణామమని మిగిలిన రైతులు కూడా ఆరోగ్యకర వ్యవసాయ విధానాలను అనుసరించి లాభాలు పొందాలని ఆకాంక్షించారు. ఖరీఫ్‌ సాగుకు వెళ్లే రైతులు నూతన పద్ధతుల గురించి ఆలోచించాలని, చిరుధాన్యాల సాగును ఆహ్వానించాలని సూచించారు.
ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు
కిసాన్‌ మేళాలో పాల్గొనేందుకు వ్యవసాయ పరిశోధనా స్థానానికి విచ్చేసిన కలెక్టర్‌ అక్కడ నెలకొల్పిన చిరు ధాన్యాల ఉప ఉత్పత్తుల తయారీ విభాగం, చిరుధాన్యాల శుద్ధి కేంద్రం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ విధాన విభాగం, బిస్కెట్ల తయారీ యూనిట్లను సందర్శించారు. వాటి ద్వారా వచ్చే ఆర్థిక ఫలాల గురించి అడిగి తెలుసుకున్నారు. యూనిట్ల పనితీరు, పరికరాల వినియోగం, ఉత్పత్తుల శుద్ధి గురించి అనకాపల్లి పరిధోశన విభాగం సహాయ సంచాలకులు డా. జగన్నాథరావు కలెక్టర్‌కు వివరించారు. వీటిని పరిశీలించిన కలెక్టర్‌ ఇలాంటి యూనిట్లను స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలి
అనంతరం జరిగిన సభలో ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పరిశోధన విభాగం సంచాలకులు పి. రాంబాబు మాట్లాడుతూ పరిశోధన ఫలాలు అందరికీ అందేలా కిసాన్‌ మేళాలు దోహదం చేస్తాయని అన్నారు. రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమృద్ధిగా వినియోగించటం ద్వారా మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
పరిశోధనలు మరింత విస్తృతం కావాలి
అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ సంచాలకులు జగన్నాథరావు మాట్లాడుతూ పరిశోధకుల కృషి ఫలితంగా ఎన్నో విజయాలు సాధించామని, రైతులు ఎన్నో విధాలుగా మేలు జరిగిందని పేర్కొన్నారు. అందరి కృషికి ఫలితంగా 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ఎఫ్‌.ఏ.వో. గుర్తించిందని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు మరిన్ని సాధించాలంటే పరిశోధనలు మరింత విస్తృతం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మేళాలో భాగంగా రైతులకు, విద్యార్థులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై, యాంత్రీకరణ వినియోగంతో పాటు ఇతర అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో విజయనగరం జిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావు, డాట్‌ కేంద్రం కో-ఆర్డినేటర్‌ కె. లక్ష్మణ్‌, సీనియర్‌ సైంటిస్టు అనురాధ, సోయిల్‌ సైంటిస్టు సంధ్యారాణి, ఇతర విభాగాలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు, రైతులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img