Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పదవతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

విశాలాంధ్ర,పార్వతీపురం: ఏప్రిల్ మూడు నుండి ప్రారంభం కానున్న పదవతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తో కలసి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ 3నుండి 18వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలు మొత్తం 8 రోజులు జరుగుతాయని, ప్రతిరోజూ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని వివరించారు. పదవ తరగతి పరీక్షల ప్రాముఖ్యత దృష్ట్యా అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్.టి.సిలో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశామని తెలిపారు. రవాణా సౌకర్యం కల్పించాలని అన్నారు. పక్కా కార్యాచరణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 210 పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఆయన తెలిపారు. 5,272 మంది బాలురు, 5,442 మంది బాలికలు రెగ్యులర్ విద్యార్థులుగా, 70 మంది ప్రైవేట్ విద్యార్థులు వెరసి 10,784 మంది విద్యార్థులు జిల్లాలో పరీక్షలు రాస్తారని ఆయన అన్నారు. ఏపి ఓపెన్ స్కూల్ పదవ తరగతి పరీక్షలకు 6 కేంద్రాలు, ఇంటర్ పరీక్షలకు 2 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అందులో 751 మంది పదవ తరగతి, 479 మంది ఇంటర్ పరీక్షలు రాస్తారని ఆయన చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించామని, 650 మంది ఇన్విజిలేటర్లను, 12 మంది రూట్ అధికారులను, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ లను నియమించామని వివరించారు. పరీక్షా కేంద్రాలకు కిలో మీటర్ దూరం పరిధిలో జెరాక్స్ దుకాణాలు మూసి వేయాలని ఆయన ఆదేశించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అన్ని కేంద్రాలలో పూర్తి స్థాయిలో బెంచీలు, టేబుల్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని రూట్ లలో ఆర్.టి.సి బస్సులను విధిగా నడపాలని ప్రజా రవాణా అధికారిని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన బందో బస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఈవీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ ఎస్.డి.వి.రమణ, డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎ.సుభాష్, జిల్లా వైద్య శాఖాధికారి డా. బగాది జగన్నాథ రావు, జిల్లారవాణా శాఖ అధికారి సి.మల్లిఖార్జునరెడ్డి, జిల్లా ప్రజా రవాణా అధికారి టి.వి.ఎస్.సుధాకర్, ఉపవిద్యా శాఖ అధికారి పి.బ్రహ్మాజీరావు, పోస్టల్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img