విశాలాంధ్ర- విజయనగరం : ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు, రైతుల ప్రయోజనార్థం జిల్లా సహాకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో, ఖరీప్ సీజన్ కు ముందునుంచే వరి విత్తనాల విక్రయం ప్రారంభించామని, ఉమ్మడి విజయనగరం జిల్లా డి.సి.ఎం.ఎస్ చైర్ పర్సన్ డాక్టర్ అవనాపు భావన పేర్కొన్నారు. విజయనగరంలోని డి.సి.ఎం.ఎస్ కార్యాలయ ఆవరణలో,బుధవారం జ్యోతి వెలిగించి పూజలు నిర్వహించి వరి, మొక్కజొన్న విత్తనాల విక్రయాన్ని ఆమె ప్రారంభించారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు జిల్లాల యువజన విభాగం జోనల్ ఇన్ చార్జ్ అవనాపు విక్రమ్ విత్తనాలను ప్రథమంగా కొనుగోలు చేశారు. అనంతరం విద్యార్ధులకు అవసరమైన లేపాక్షి నోట్స్ పుస్తకాల విక్రయాలను కూడా డిసిఎంఎస్ చైర్ పర్సన్ అవనాపు భావన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అవనాపు భావన మాట్లాడుతూ రైతుల ప్రయోజనం కోసం మార్కెట్ కంటే తక్కువ ధరలో నాణ్యమైన ఎంటియు 1121, సోనా మసూరి,సాంబమసూరి, ఫౌండేషన్ వరి విత్తనాలను అలాగే పయొనీర్ మొక్కజొన్న విత్తనాల విక్రయాలను డిసిఎంఎస్ లో ప్రారంభించామన్నారు. గత సంవత్సరం విత్తనాలను వాడిన రైతులు దిగుబడి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ప్రతి బ్యాగ్ నుంచి 100 విత్తనాలు వేరుచేసి మొలక శాతం పరీక్షించాలన్నారు. 70% మొలక రాకపోయినట్టయితే ఆ విత్తనాల బ్యాగ్ సీల్ ను చింపకుండా తిరిగి అందజేస్తే, వాటి స్ధానంలో కొత్త బ్యాగు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కోరుకొండ మాజీ సర్పంచ్ లాగుడు శివాజీ, డిసిఎంఎస్ డైరెక్టర్ ఎస్.సన్యాసి నాయుడు, పి.ఎ.సి.ఎస్ అధ్యక్షులు కృష్ణ, డి.సి.ఎం.ఎస్ బిజినెస్ మేనేజర్ సాయి కుమార్, డిసిఎంఎస్ సిబ్బంది రమేష్, రాఘవులు, సూరప్పడు, సీతారామ్, రాజు, వెంకటరావు, పద్మ, వైకాపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.