…విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం – జనసేన నేత గురాన అయ్యలు
విశాలాంధ్ర విజయనగరం : మహాకవి , సంఘసంస్కర్త గురజాడ అప్పారావు పేరిట ఎంతో ప్రతిష్టాత్మకంగా 2021 లో నెలకొల్పిన జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం గత వైకాపా ప్రభుత్వ చర్యలతో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని జనసేన నేత గురాన అయ్యలు ఆరోపించారు.
గురువారం ఆయన మీడియా తో మాట్లాడుతూ జేఎన్టీయూ కాకినాడ కి అనుబంధ కళాశాలగా ఉన్నటువంటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విజయనగరం యూనివర్సిటీ హెూదా కల్పిస్తూ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆక్ట్ నెంబర్ 30 ఆఫ్ 2008 ను సవరణ చేసి జేఎన్టీయూ అమెండ్మెంట్ యాక్ట్ 22 ఆఫ్ 2021 ద్వారా జేఎన్టీయూ జీవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని,
పేరు కి విశ్వవిద్యాలయం అయితే ఏర్పాటు చేశారు కానీ దానికి సమకూర్చవలసిన నిధులు, బోధన , బోధనేతర సిబ్బంది నియామకాలు ఏమి చేపట్టకుండా తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైందన్నారు.
ఈ విశ్వవిద్యాలయానికి కావలసిన వసతులు సమకూర్చకపోగా అక్కడ నియమితులైనటువంటి బోధన, బోధనేతర సిబ్బందిని చట్ట వ్యతిరేక బదిలీలు చేశారని ఆరోపించారు.
2012వ సంవత్సరంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విజయనగరంకు మాత్రమే నియమితులైనటువంటి 41 మంది బోధనా సిబ్బందిలో 21 మంది బోధన సిబ్బందిని , ఆరుగురు బోధనేతార సిబ్బందిని సవరణ చట్టం 22 ఆఫ్ 2021కి వ్యతిరేకంగా దొడ్డి దారిన జేఎన్టీయూకే కాకినాడకు గత పాలకాలు తరలించడం దారుణమన్నారు.
ఈ వ్యవహారం మొత్తం పూర్వ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి ప్రోద్బలంతో, జెఎన్టియుకే కాకినాడ పూర్వ ఉపకులపతి జివిఆర్ ప్రసాద్ రాజు చేసినట్లు ఆరోపించారు.
ఈ వ్యవహారం మొత్తం గత ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమ చంద్రారెడ్డి కనుసన్నల్లో జరగటంతో ఈ విషయమై ఎంత మొరపెట్టుకున్నా ఉన్నత విద్యా మండలి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నారు.
సవరణ చట్టం 22 ఆఫ్ 2021 ప్రకారం బోధన , బోధనేతర సిబ్బంది బదిలీల గురించి ఎటువంటి నియమాలు లేనప్పటికీ ఈ బదిలీల వ్యవహారం అడ్డగోలుగా చేశారన్నారు.
ఇందుకుగాను కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వున్నాయన్నారు.
ఇలా జెఎన్టియు జీవి విజయనగరం యూనివర్సిటీ నుంచి జెఎన్టియుకె కాకినాడ యూనివర్సిటీకి బదిలీ అయినటువంటి బోధనా సిబ్బంది జేఎన్టీయూ జీవీ నుంచి ఎటువంటి రిలీవింగ్ ఆర్డర్ తీసుకోకుండానే జేఎన్టీయూకే కాకినాడలో చేరారన్నారు.
41 మంది బోధన సిబ్బందిలో 21 మంది బోధన సిబ్బందిని జేఎన్టీయూకే కాకినాడకి తరలించటం ద్వారా జెఎన్టియు జీవి లో చదువుతున్న వేల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు గాలికి వదిలేశారన్నారు. జేఎన్టీయుజీవీ లో ఏడు బి. టెక్ కోర్సులు , ఎనిమిది ఎం. టెక్ కోర్సుల్లో 2000 విద్యార్ధులు చదువుతున్నారని,
జేఎన్టీయూ విజయనగరంలో కొన్ని బ్రాంచిలలో అసలు రెగ్యులర్ టీచింగ్ ఫాకల్టీ లేరన్నారు. సివిల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో అసలు ఫాకల్టీ లేరన్నారు.
అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచ్ చేయటానికి అసలు రెగ్యులర్ టీచర్స్ లేరన్నారు
బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్ధి సంఘాలు కూడా త్వరలో ఆందోళనకు దిగడానికి సిద్ధమవుతున్నారన్నారు.
ఈ చట్ట వ్యతిరేక బదిలీల వ్యవహారం పై ప్రభుత్వ పెద్దలు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి వెనుకబడిన ఉత్తరాంధ్రలో స్థాపించబడిన ప్రతిష్టాత్మక జేఎన్టీయూజీవి విశ్వవిద్యాలయంలో చదువుతున్న వేల మంది పేద విద్యార్థుల భవిష్యత్తుకు న్యాయం చేకూర్చి , విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేశారు.