నేషనల్ ఛైల్డ్ రైట్స్ సంస్థ సభ్యులు డాక్టర్ ఆనంద్
విశాలాంధ్ర -విజయనగరం : జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు తీసుకున్న చర్యలు అభినందనీయమని, నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సిపిసిఆర్) సభ్యులు డాక్టర్ ఆర్.జి.ఆనంద్ అన్నారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు, కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్‌లో సమావేశాన్ని నిర్వహించి, జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరించారు. బాల్య వివాహాల నిర్మూలనపై దృష్టి పెట్టామని, దీనిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. బాల్యవివాహాలకు సిద్దపడిన తల్లితండ్రులకు అవగాహన కల్పించి, వాటిని ఆపివేయిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా బాలికా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, బాలురతో సమానంగా బాలికలు కూడా డిగ్రీ లేదా ఇతర ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వన్‌స్టాప్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు.
జిల్లాలో చిరుధాన్యాల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతోందని, చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నామని కలెక్టర్ అన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని వివరించారు. జిల్లాలో చేపట్టిన చర్యల పట్ల ఎన్‌సిపిసిఆర్ సభ్యులు ఆనంద్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణా సంస్థ ఛైర్మన్ కేసలి అప్పారావు, జిల్లా ఛైర్మన్ హిమబిందు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఐసిడిఎస్ పిడి బి.శాంతకుమారి, జెడ్‌పి సిఇఓ డాక్టర్ ఎం.అశోక్‌కుమార్, సిపిఓ పి.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.