రూ.52 కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు
రూ.1000 కోట్లతో ఇంటింటికీ త్రాగునీరు
జిల్లాపరిషత్ ఛైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం, సెప్టెంబరు 25 ః పదవిని హోదాగా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తున్నామని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్నామని చెప్పారు. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, సోమవారం జెడ్‌పి సమావేశ మందిరంలో సిఇఓ కె.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది అభినందనలు తెలిపారు. అనంతరం ఛైర్మన్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, రెండు జిల్లాల కలెక్టర్లు, ఎంపి, ఎంఎల్‌సిలు, ఎంఎల్ఏల సంపూర్ణ సహకారంతో, అందరినీ సమన్వయ పరుచుకుంటూ, పారదర్శక పాలనను అందిస్తున్నామని చెప్పారు. కార్యకర్తలకు, సామాన్య ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారితో మమేకం అవుతున్నామని అన్నారు. జెడ్పిలో ప్రతిపక్ష పార్టీలకు ప్రాతినిధ్యం లేనప్పటికీ, తమ పార్టీ సభ్యులే నిరంతరం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న విషయం తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ నుంచి సుమారు రూ.51.74 కోట్లతో వివిధ అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించినట్లు ఛైర్మన్ తెలిపారు. త్రాగునీరు, రహదారుల నిర్మాణానికి అత్యధికంగా నిధులను వెచ్చించినట్లు తెలిపారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జెడ్‌పి ద్వారా కృషి చేశామన్నారు. ఉపాధిహామీ పథకం నిధులను సక్రమంగా, సకాలంలో వినియోగించుకొని, ప్రాధాన్యత, ప్రాధాన్యేతర పనులను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేసినట్లు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులను సకాలంలో వినియోగించుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలు, ఆదేశాలకు అనుగుణంగా శతశాతం నిధులను వెచ్చించినట్లు వివరించారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రతీఒక్కరికీ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల ఫలాలను అందిస్తున్నట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా సుమారు రూ.వెయ్యి కోట్లతో ఉమ్మడి జిల్లాలో దశలవారీగా ఇంటింటికీ త్రాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, దీనిలో భాగంగా ఇప్పటివరకు సుమారు రూ.వంట కోట్లు వరకు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. అక్టోబరు నాటికి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 46 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలను కల్పించామన్నారు. జెడ్‌పి అధికారులు, సిబ్బంది సహకారం మరువలేనిదని, వారి సేవలను గుర్తించి 57 మందికి పదోన్నతులను అందించినట్లు తెలిపారు. అందరి సహకారంతో ఆదర్శవంతమైన జిల్లాపరిషత్ గా నిలబెట్టేందుకు తనవంతు కృషి చేస్టున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. విలేకర్ల సమావేశంలో పలువురు జెడ్‌పిటిసి సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.