దరఖాస్తు చేస్తే పరిశీలించి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశాలు
తగిన ఆధారాలుంటే ఆధార్ కార్డులో వయస్సు మార్పు : జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి
గజపతినగరంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం
పాల్గొని వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్, జె.సి.
ప్రజల నుంచి 115 వినతులు స్వీకరణ
ఆక్రమణలపై తక్షణం స్పందించాలని కలెక్టర్ ఆదేశం
బొండపల్లిలో పంటల ఇ- క్రాప్ నమోదును పరిశీలించిన కలెక్టర్
విజయనగరం(గజపతినగరం), సెప్టెంబరు 27 : గ్రామాల్లో భూములు, స్థలాల ఆక్రమణకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎస్.నాగలక్ష్మి మండలస్థాయి అధికారులను ఆదేశించారు. ఈ తరహా వినతులపై వెంటనే స్పందించడం ద్వారా ఇటువంటివి సహించబోమనే సందేశాన్ని ఇవ్వాలన్నారు. గజపతినగరం మండలపరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండలస్థాయిలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ శ్రీ మయూర్ అశోక్, జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వినతులను ఆయా మండల స్థాయి అధికారులకు అందజేసి వాటిని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వినతుల పరిష్కారంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా వినతుల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, దీనిని గుర్తించి తమ శాఖలకు సంబంధించిన వినతులను తమ స్థాయిలో పరిష్కరించగలిగితే వెంటనే పరిష్కరించాలని, జిల్లా స్థాయిలో పరిష్కరించాల్సినవి తమ జిల్లా శాఖ అధికారుల ద్వారా తెలియజేయాలన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాల్సిన అంశాలను క్రోడీకరించి అందజేయాలన్నారు. మండల స్థాయిలో అధికారుల మధ్య సమన్వయంతో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని, మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపిడిఓ, ఎస్.హెచ్.ఓ.లతో ఏర్పాటు చేసిన కమిటీ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో తరచూ సమావేశమై ఆయా సమస్యలపై చర్చించి పరిష్కరించాలన్నారు. ప్రజలు అందజేసిన వినతులను ఆయా శాఖలు పరిష్కరించాక వాటిని పరిష్కరించిన తీరుపై జిల్లా స్థాయిలో ఆడిట్ నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైన వినతులను మళ్లీ తెరచి పరిష్కరించేందుకు ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్పారు.
గజపతినగరం మండలంలో ప్రజా వినతుల పరిష్కారం సంతృప్తికరంగా వుందన్నారు. జిల్లా సగటుకంటే ఇక్కడ సంతృప్తి శాతం అధికంగా వుందని పేర్కొంటూ మండలస్థాయి అధికారుల బృందాన్ని అభినందించారు. అధికారులు మరింతగా చొరవ చూపి పంచాయతీల్లో రోడ్లు, డ్రెయిన్లు తదితర పనులను అందుబాటులో వున్న నిధులతో చేపట్టే అవకాశాన్ని పరిశీలించాలని చెప్పారు.
గజపతినగరంలో మొత్తం 115 వినతులు అందాయని వీటిలో అధికంగా రెవిన్యూ పరమైన అంశాలపైనే వినతులు వున్నాయని కలెక్టర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. రెవిన్యూ తర్వాత అధికంగా విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలపై వినతులు అధికంగా అందాయన్నారు. 2019 కంటే ముందు మంజూరైన గృహాలకు బిల్లుల చెల్లించాలని కోరుతూ పలు వినతులు అందాయని, వీటన్నింటినీ ఆన్‌లైన్‌లో తనిఖీ చేసి స్టేజ్ అప్‌డేషన్ చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఇటువంటి వినతులపై స్టేజ్ అప్‌డేషన్ చేసినపుడు ఆయా లబ్దిదారులకు 30 నుంచి 40 శాతం వరకు బిల్లులు వచ్చాయన్నారు. ఆయా ఇళ్ల లబ్దిదారులు ప్రభుత్వానికి దరఖాస్తులు అందజేస్తే వాటిని పరిశీలించి అర్హత మేరకు బిల్లుల చెల్లింపుకోసం సిఫారసు చేస్తారని పేర్కొన్నారు. ఫించన్లకు సంబంధించి ఆధార్‌లో వయస్సు తక్కువగా నమోదు అయినట్లు పలు ఫిర్యాదులు అందాయని, అయితే పదో తరగతి సర్టిఫికేట్ లేదా జనన ధ్రువపత్రం లేదా డాక్టర్ జారీచేసిన వయస్సు ధృవపత్రం వంటి తగిన ఆధారాలతో దరఖాస్తు చేసిన వారికి ఆధార్ కార్డులో వయస్సు మార్పులు చేసే అవకాశం వుంటుందన్నారు. కొత్త ఇళ్ల మంజూరుకు సంబంధించిన దరఖాస్తులను అర్హతలను పరిశీలించిన మీదట ఏ.ఇ.లు తమ లాగిన్ ద్వారా తదుపరి చర్యలు చేపడతారని పేర్కొన్నారు.
గజపతినగరంలో మొత్తం 115 వినతులు అందగా వీటిలో రెవిన్యూ అంశాలపై 28, ఫించన్లకోసం 34, గృహాలకు సంబంధించి 18, ప్రభుత్వ పథకాల మంజూరుకోసం 23, విద్యుత్‌కు సంబంధించిన సమస్యలపై 6, సదరంకు సంబంధించి 3, క్లాప్‌మిత్రల సమస్యలపై 1, రైతుభరోసా కేంద్రాల బిల్లుల కోసం 1 వినతులు అందాయి.
జగనన్నకు చెబుదాంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ బి.సహాదిత్ వెంకట్ త్రివినాగ్, ఆర్.డి.ఓ. శేషశైలజ, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. రాజ్‌కుమార్, డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.