విశాలాంధ్ర,పార్వతీపురం : జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం పెద్దఎత్తున ఁశ్రమదానంఁ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పార్వతీపురం పట్టణానికి జిల్లా కేంద్రంకు ఉండాల్సిన హంగులు ఉండాలన్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు ఁశ్రమదానంఁ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణ, చుట్టుప్రక్కల, ఇతరప్రాంతాల్లో శ్రమదానం జరుగుతుందన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఉద్యోగులను బృందాలుగా విభజించి ఒక్కో బృందానికి ఒక్కో ప్రాంతాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బాగాచేసిన బృందానికి బహుమతులు అందించేందుకు యోచిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి వారం శ్రమదానంచేసి కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ప్రజలు భాగస్వామ్యం కావాలి:
పట్టణ పారిశుధ్యం, సుందరీకరణలో భాగంగా శ్రమదానం కార్యక్రమంలో పట్టణ ప్రజలు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. పట్టణం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.