Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పి డి ఆకస్మిక సందర్శనలో చినబోగిలి ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్

కంప్యూటర్ ఆపరేటర్ కు బదిలీ
సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఉపాధి హామీ పథకం ప్రోజెక్టు డైరెక్టర్

విశాలాంధ్ర,సీతానగరం: స్థానిక ఉపాధి హామీ పథకం కార్యాలయంలో సిబ్బంది పనితీరు సక్రమంగాలేదని ఉపాధి హామీ పథకం జిల్లా ప్రోజెక్టు డైరెక్టర్ కె. రామచంద్ర రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.గురువారంనాడు ఆయన కార్యాలయం తెరిచే సమయానికి ఆకస్మికంగా విచ్చేసి తనిఖీ చేశారు. సక్రమంగా విధులు నిర్వర్తించక పోవడంతోపాటు రికార్డుల నిర్వహణ లేకపోవడం, నిర్ణీత సమయంలో రాకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కంప్యూటర్ ఆపరేటర్ బి.కవితను వీరఘట్టం మండం కార్యాలయానికి బదిలీచేస్తూ అక్కడికక్కడే ఉత్తర్వులు జారీచేశారు. ఇదే సమయంలో పెద్దగ్రామమైన చినబోగిలి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బొట్ట. అప్పారావు వారంరోజులు నుండి పనులు పెట్టకపోవడం, కొత్త పనుల ప్రతిపాదనలు చేయకపోవడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం గుర్తించి ఫీల్డ్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేస్తూ అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేశారు. బూర్జగ్రామంలోకూడా పనులు సక్రమంగా చేయకపోవడంపై ఫీల్డ్ అసిస్టెంట్ ను పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్యాలయంలో ఉపాధిహామీ పథకం సిబ్బంది అందరూ పనితీరును మెరుగుపరుచుకోవాలని, లేదంటే వేటు తప్పదని హెచ్చరించారు. గ్రామాల్లోని వేతనదారులనుండి డబ్బులు వసూళ్ళు గూర్చి ఆరా తీశారు. తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యాలయ పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. సక్రమంగా విధులు నిర్వహించక పోవడంవల్ల వేతనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.ఆయనవచ్చే సమయానికి ఒక్క కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమేరాగా, ఆయన వచ్చాక కొంతసమయం తరువాత సిబ్బంది రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగితే వారిని తొలగించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ఎం ఎల్ ఎన్ ప్రసాద్, ఏపిఓ భాను , సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img