Friday, December 1, 2023
Friday, December 1, 2023

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయ సమాధి కట్టాలి

రాష్ట్ర మాజీమంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు
విశాలాంధ్ర, శృంగవరపుకోట : పేదల నోట్లో మట్టికొట్టి పట్టెడన్నం దొరకనివ్వకుండా అన్న క్యాంటీన్లను బుల్డోజర్లతో పడగొట్టి దుర్మార్గంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయ సమాధి కట్టాలని రాష్ట్ర మాజీమంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆర్ధిక సహకారంతో ఎస్.కోట పట్టణంలో 111 రోజులుగా నడుస్తున్న అన్న క్యాంటీన్ను మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు మంగళవారం సందర్శించి స్థానిక నాయకులతో కలిసి పేదలకు భోజనాలు వడ్డించారు. ముందుగా అన్న క్యాంటీన్లో ఏర్పాటు చేసిన భారీ కేకును మాజీమంత్రి కట్ చేసి మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, నాయకులకు తినిపించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఉచిత అన్నదానంతో పేదల ఆకలి తీర్చేవారమని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఎత్తి వేయించారని ఆవేదన వ్యక్తంచేశారు. పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లను తొలగించవద్దని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేసినా ఖాతరు చేయలేదని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ఎన్టీ రామారావు తిరుమల, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం వంటి దేవస్థానాల్లో భక్తులకు ప్రతిరోజూ ఉచిత భోజనాలు పెట్టే కార్యక్రమాలు ఏర్పాటు గుర్తు చేశారన్నారు. ఇప్పటి ప్రభుత్వంలో ఆలయాల్లో పెడుతున్న ఉచిత భోజనాలు కూడా నాణ్యత లేకుండా పోయాయని ఎద్దేవాచేశారు. పేదల పక్షపాతి అంటూనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దౌర్భాగ్య పరిపాలనను రానున్న ఎన్నికల్లో సమాధి కట్టాలన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో సుమారు 95 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు తన సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇక రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడితే 175 నియోజకవర్గాల్లోను అన్న క్యాంటీన్లను నిర్వహిస్తామని, అవసరమైన పక్షంలో మండలానికి ఒకటి చొప్పున అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img