Homeఆంధ్రప్రదేశ్భూమి ఇవ్వం.. ప్రాణాలైనా ఇస్తాం.. భోగాపురంలో రైతుల గర్జన

భూమి ఇవ్వం.. ప్రాణాలైనా ఇస్తాం.. భోగాపురంలో రైతుల గర్జన

- Advertisement -

ఎవడైనా పంట భూముల్లో డేటా సెంటర్ పెడతాడా?”

మహిళల ఆక్రందన.. వృద్ధుల ఆవేదన.. యువత ఆక్రోశంతో దద్దరిల్లిన పురవీధులు

విశాలాంధ్ర–భోగాపురం: “అన్నం తింటున్న మనిషి ఎవడైనా పంట భూముల్లో డేటా సెంటర్ పెడతాడా?” అంటూ రైతులు సంధించిన ప్రశ్నతో భోగాపురం దద్దరిల్లింది. పచ్చని పంట పొలాలే తమ బతుకులకు ఆధారమని, తరతరాలుగా సాగు చేసుకుంటూ వస్తున్న భూములను రిలయన్స్ డేటా సెంటర్ కోసం ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన వేలాదిమంది రైతులు, మహిళలు, వృద్ధులు, యువత భోగాపురం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. “మా భూములు మాకు కావాలి.. భూమి ఇవ్వం.. మా ప్రాణాలు పోయినా ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వం” అంటూ చేసిన నినాదాలతో భోగాపురం హోరెత్తింది. గత 250 రోజులుగా తాము ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం తమ గోడును పట్టించుకోలేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు తమ బాధలు చెప్పుకున్నా ఫలితం లేకపోయిందని వాపోయారు. ఇకపై ఎవరినీ వేడుకునే పరిస్థితి లేదని, తమ భూములను తామే కాపాడుకుంటామని స్పష్టం చేశారు. నిరసనలో మహిళల ఆవేదన అందరినీ కదిలించింది. “చిన్నచిన్న కమతాలే మా కుటుంబాలకు ఆధారం. ఆ భూములు కూడా తీసుకుంటే మేమంతా ఏమైపోవాలి? మా పిల్లలను ఎలా పోషించాలి? ఎక్కడికి వెళ్లాలి?” అంటూ పలువురు మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. తమ జీవితాంతం కష్టపడి సాగు చేసుకున్న నేల తమ చేతుల నుంచి జారిపోతుందన్న ఆవేదనను వ్యక్తం చేశారు. తమ భూమి తమకు కేవలం ఆస్తి కాదని, కుటుంబానికి అన్నం పెట్టే తల్లి లాంటిదని పేర్కొన్నారు.

మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి కూడా తీవ్ర ప్రశ్నలు సంధించారు. “మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మా మీద ఇంత పని చేస్తారా ?” అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రిలియన్స్ సంస్థ మీద అంత ప్రేమ ఉంటే మీ కున్న భూమిలో డేటా సెంటర్లు పెట్టుకోండని నిరసించారు. వృద్ధ రైతుల పరిస్థితి మరింత హృదయవిదారకంగా కనిపించింది. జీవితమంతా ఈ నేలపైనే ఆధారపడి కుటుంబాలను పోషించుకున్నామని, వృద్ధాప్యంలో ఉన్న తమకు భూమి పోతే ఇంకేం మిగులుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ చేతులతో దున్నిన నేలలోనే తమ పిల్లలు, మనుమలు కూడా జీవించాలని కోరుకుంటున్నామని, ఆ హక్కును తమ నుంచి లాక్కోవద్దని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. “మా ప్రాణాలు పోయినా సరే.. ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వం” అంటూ రైతులు చేసిన ప్రకటనతో నిరసన తీవ్రత స్పష్టమైంది. తమ భూములను కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వారు ప్రకటించారు. రైతుల ఆక్రందనను ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకు వెళ్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

భారీ నిరసన అనంతరం రైతులు, ఉద్యమ నాయకులు రిలయన్స్ డేటా సెంటర్ కోసం తమ భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తూ తహసీల్దార్ హేమంత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రైతుల ఆవేదన, అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ హేమంత్ కుమార్ వారికి తెలిపారు. తహసీల్దార్‌తో మాట్లాడుతున్న సమయంలో భోగాపురం గ్రామానికి చెందిన కోలా పుష్పావతి కొంత అస్వస్థతకు గురికావడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు. ఈ నిరసనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సి ఐ దుర్గాప్రసాద్,సిబ్బంది జాగత్తలు వహించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు