Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు…

ఎమ్మెల్యే మంతెన రామరాజు…
విశాలాంధ్ర` ఉండి:
అధికారమన్నది ఏ పార్టీకి శాశ్వతం కాదని అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలవంచితే తస్మాత్‌ జాగ్రత్త అని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి హెచ్చరించారు. నరసాపురం పార్లమెంట్‌ తెలుగు యువత కార్యనిర్వాహణ కార్యదర్శి బురిడి రవిబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ మంగళవారం ఉండి మండల టీడీపీ నాయకులతో కలిసి రవిబాబు కుటుంబ సభ్యులను ఎన్‌ఆర్‌పి అగ్రహారం బీసీ కాలనీలో రవిబాబు నివాసానికి వెళ్లి పరామర్శించి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ, టీడీపీిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న రవిబాబుపై అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అధికార అహంభావంతో పోలీసుల సహాయంతో అత్తమూరులో జరిగిన గొడవకి రవిబాబుకి ఎటువంటి సంబంధం లేకపోయినా రవిబాబుపై నాన్‌ బెయిల్‌ బుల్‌ అక్రమ కేసులు పెట్టించి భీమవరంలోని సబ్‌ జైల్లో వేయించారని ఇది చాలా బాధాకరమన్నారు. టీడీపీ రవి బాబుకి అండగా ఉంటుందన్నారు. ఈ కేసులో ఉండి ఎస్‌ఐ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని అధికార పార్టీ నాయకులతో చేయి కలిపి రవిబాబు ఇంటికి వచ్చి మహిళలను గెంటి దురుసుగా ప్రవర్తించడం చాలా హేయమైన చర్య అని అన్నారు. ఎస్‌ ఐ పనితీరుపై జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు పై అధికార పార్టీకి చెందిన నాయకులు అనేక రకాలు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని వాటికి లేని చర్యలు గల్లీ నాయకులు పై పోస్టు పెడితే వస్తుందా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా ఇలానే ప్రవర్తిస్తే అప్పటి ప్రతిపక్షం నేటి అధికారపక్షం ఎవరైనా బయటకు తిరిగేవారా అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు మాటల విన్న ఆకివీడు మండలానికి చెందిన ఒక ప్రభుత్వ అధికారి నేడు జైల్లో మగ్గిపోతున్నారని చట్టం ఎవరు చుట్టం కాదని పక్కనే జరిగిన సంఘటన చూసి కూడా ఉండి మండల అధికారులు ఇంకా తప్పుడు కేసులు కట్టి ప్రతిపక్ష నాయకులకు భయభ్రాంతులకు గురి చేయడం మంచి పరిణామం కాదన్నారు. రవి బాబుకు న్యాయం జరిగే వరకూ టీడీపీ అండగా ఉంటుందన్నారు. విద్యావంతుడు సీనియర్‌ జర్నలిస్ట్‌ అయిన రవి బాబు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపుతూ ప్రజలకు తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వాటిని జీర్ణించుకోలేని అధికారపక్ష నాయకులు రవిబాబుపై కుట్రపూరితంగా జైలుకు పంపించాలన్న దురుద్దేశంతో సెక్షన్‌ 324, 120 వేసి రిమాండ్‌కి పంపించడం చాలా దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవిబాబును జైలుకు పంపించాలన్న దురుద్దేశంతో స్టేషన్‌ బెయిలు పై వచ్చే మిగతా ఐదుగురు దళిత సోదరులను కూడా జైలుకు పంపించడంలో పోలీసులు వెనుకడుగు వేయలేదంటే దాని వెనక ఎంత కుట్ర దాగుందో స్పష్టంగా అర్థం అవుతుందని తెలిపారు. ఈ అక్రమ అరెస్ట్‌ పై ప్రైవేట్‌ కేసు వేసి టిడిపి తరపున న్యాయ పోరాటం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు జుత్తిగ శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు పొత్తూరి వెంకటేశ్వరరాజు, కాగిత మహంకాళి, సూర్య నారాయణ రాజు, కట్టా రాంబాబు, మంతెన సాయి లచ్చిరాజు, కరిమెరక శ్రీనివాసరావు, కరిమెరక శివ నాగరాజు, ఎస్‌ సి సెల్‌ నాయకులు విక్టర్‌ బాబు, చెన్నం శెట్టి హరి నాయుడు, దూసనపూడి రాంబాబు, కిన్నిర వెంకన్న, గురుగుబెల్లి సత్యనారాయణ, కాగిత బుజ్జి, గురుగుబెల్లి బాబురావు, గంధం బుజ్జి యువరాజు, పరిమి కాశి , యడ్ల శ్రీనివాసరావు, సుమారు 200కు పైగా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img