విశాలాంధ- కొయ్యలగూడెం: పరింపూడి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని పరింపూడి గ్రామపంచాయతీ సర్పంచ్ ముప్పిడి విజయ కుమారి పేర్కొన్నారు. పంచాయతీ నిధులు రూ.40 లక్షలతో పరింపూడి, కొయ్యలగూడెం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లకు, డ్రైనేజీ నిర్మాణానికి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంగళవారం భూమి పూజ నిర్వహించారు, ఈ సందర్భంగా విజయ కుమారి మాట్లాడుతూ పరింపూడి పంచాయతీ అభివృద్ధికి పంచాయతీలోని అందరు ప్రజాప్రతినిధులు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. 30 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు జరిగే అభివృద్ధి గురించి భావితరాల వారు చెప్పుకున్నప్పుడే పంచాయతీకి గ్రామానికి నిజమైన అవార్డు దక్కినట్లని ఆమె తెలిపారు. ఎంపీటీసీ సభ్యులు మట్ట వనజాక్షి, గంటా శ్రీనివాసరావు, పిఎసిఎస్ సొసైటీ అధ్యక్షులు మంతెన సోమరాజు, మాజీ ఎంపీపీ మట్ట సత్తిపండు, ఉప సర్పంచ్ సంకు కొండలరావు మాట్లాడుతూ ఏలూరు ఎంపీ, పోలవరం శాసనసభ్యుల సహకారాలతో పట్టణంలోని రూ.1కోటి నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ ఏఈ రాఘవేంద్రరావు, వర్క్ ఇన్స్పెక్టర్ మంతెన రామరాజు, వార్డ్ సభ్యులు రాచూరి మదన్, పులపల్లి రవికుమార్, మాడుగుల సువార్త, ఊసల దివ్య, మండ నాగేశ్వరరావు, సమైక్య యూత్ అధ్యక్షుడు గంగిరెడ్ల సతీష్ , పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నక్క బాబి, తదితరులు పాల్గొన్నారు.