దళితుల మధ్య చిచ్చుపెట్టి ఏం సాధిస్తారు…
సర్పంచ్ భర్త పేరుపై మండిపడ్డ తల్లమ్మ చెరువు దళితులు…
విశాలాంధ్ర -ఉండి: దళితులంటే అంత అలుసా.. దళితుల మధ్య చిచ్చు పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు అంటూ చిన్న పుల్లేరు గ్రామ సర్పంచ్ భర్త పెనుమత్స రామరాజు పై తల్లమ్మచెరువు దళిత లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండి మండలం చిన్న పుల్లేరు గ్రామం తల్లం చెరువు లో డ్రైనేజీ సమస్య మంగళవారం చిలికి చిలికి గాలి వానగా మారింది. ఈ సందర్భంగా తల్లమ్మ చెరువు దళితులు మాట్లాడుతూ,గ్రామ సర్పంచ్ భర్త నియంత పాలన సాగిస్తూ దళితుల మధ్య చిచ్చు పెట్టి ఒకే ఇంటికి పైపులైను ఇచ్చి 10 ఇళ్ళను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులంతా ఐక్యంగా ఉన్న తమ ప్రాంతంలో ఒక వర్గాన్ని ప్రోత్సహించి తమలో తమనే కొట్టుకునేలా సర్పంచ్ భర్త అరాచకం సృష్టిస్తున్నాడని తల్లమ్మ చెరువు ప్రజలు మండిపడ్డారు. తమ ప్రాంతంలోని ఇళ్ళన్నివదిలేసి ఒకరి ఇంటికి మాత్రమే వెళ్లేలా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు తమకు న్యాయం జరగలేదని వాపోయారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు, పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులకు వత్తాసు పలికి తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ నిధులతో గ్రామానికి అభివృద్ధి చేయడం పోయి అధికార అహంకారంతో పంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తూ ఒక్కరి కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి డ్రైనేజీ నిర్మించడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడని డ్రైనేజీ ఎందుకని ఒక్కరి కోసం చేయాలంటే సొంత నిధులతో చేసుకోవాలని పంచాయతీ నిధులతో కాదని పదిమందికి ఉపయోగపడని అభివృద్ధి పనులు గ్రామానికి ఎందుకన్నారు. ఈ కార్యక్రమంలో దళితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.