విశాలాంధ్ర – తాడేపల్లిగూడెం రూరల్ : పట్టణ, అర్బన్, కార్పొరేషన్ ప్రాంతాల్లోని మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకురాష్ట్రవ్యాప్తంగా మహిళా మార్టులు ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మెప్మా మిషన్ డైరెక్టర్ వి. విజయలక్ష్మీ అన్నారు. గురువారం స్థానిక మూన్ లైట్ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆసరా, సున్నావడ్డీ, మహిళా మార్ట్, డీమార్ట్, పట్టణ పేదరిక నిర్మూలన, టిడ్కో ఇళ్ళ పంపిణీ, డ్వాక్రా రుణాల మంజూరు తదితర అంశాలపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మెప్పా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మీ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లోని మహిళలను అన్ని రంగాల్లో ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని వనరులను సద్వినియోగం చేసుకునే విధంగా మహిళలకు వివిధ వ్యాపారాలపై శిక్షణ అందిస్తామని అన్నారు. డ్వాక్రా గ్రూప్ లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా డీమార్ట్లను, మహిళా మార్ట్లను మహిళల ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మార్ట్లను ఏడు జిల్లాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు వీటి ద్వారా లక్షల రూపాల ఆదాయం సమకూరిందని తెలిపారు. ఈ సంవత్సరంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, ద్వారా తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు తదితర ప్రాంతాల్లో మహిళా మార్ట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 మహిళా, డీమార్ట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. డ్వాక్రా గ్రూప్ ఆధ్వర్యంలో వ్యాపార నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు శిక్షణ అందిస్తామని తెలిపారు. మహిళలే యజమానులు, ఉత్పత్తి దారులు అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మెప్మా పిడి ఇమ్మానుయేలు, డిసి జగదీష్, తాడేపల్లిగూడెం మెప్మా ప్రొజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్, పట్టణ మహిళా సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు బోళెం రామలక్ష్మీ, డ్వాక్రా మహిళలు, తదితరులు పాల్గొన్నారు.