మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు…
విశాలాంధ్ర -కొయ్యలగూడెం: అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని పోలవరం మాజీ శాసనసభ్యులు మొడియం శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నియోజకవర్గంలో ధాన్యం,మొక్కజొన్న, పొగాకు, మిర్చి పంటలు పూర్తిగా పాడైపోయాయని రైతాంగం తీవ్రంగా నష్టపోయి పీకల్లోతుల్లో అప్పుల్లో మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రకృతి తప్పిదమని ప్రభుత్వం చెబుతుందని వాస్తవంగా రైతు భరోసా కేంద్రాలలో సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు నష్టపోయేవారు కాదని తెలిపారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే రైతులు నష్టపోయేవారు కాదన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోని పంట చేతికొచ్చినా నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ప్రస్తుత పరిస్థితి నెలకొందని విమర్శించారు. ధాన్యం పట్టుబడి కి గోనెసంచులు ప్రభుత్వం ఇస్తామన్నా రైతు భరోసా కేంద్రాలలో సరిపడా సంచులు లేకపోవడం కూడా నష్టానికి కారణం అన్నారు. రైతులకు సకాలంలో ప్రభుత్వం సంచులు పూర్తిగా సమకూర్చకుండా రైతులను మోసం చేసిందన్నారు. ప్రభుత్వం, మిల్లర్ల మధ్య రహస్య ఒప్పందం కారణంగా కూడా రైతుల నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.రైతుల పక్షపాతి అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు.ప్రభుత్వ యంత్రాంగం గ్రామస్థాయిలో వర్ష ప్రభావంతో నష్టపోయిన పంటలను గుర్తించి అంచనా వేసి నివేదికను సమర్పించి తక్షణం సాయం అందించే దిశగా కృషి చేయాలని
కోరారు. లేనిపక్షంలో రైతులు తరఫున న్యాయం జరిగే వరకూ టిడిపి పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.