పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు….
లబోదిబోమంటున్న స్థానిక మహిళలు…
విశాలాంధ్ర -ఆకివీడు: ఆకివీడు బైపాస్ రోడ్ లోని పాన్ షాపు ముసుగులో రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుపుతూ మందుబాబులకు అక్కడే సిటింగులను ఏర్పాటు చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానిక మహిళలు వాపోయారు. ఇదే అంశంపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం లేదని మండిపడుతున్నారు. పాన్ షాపులు ముసుగులో మద్యం అమ్మకాలు ,మద్యం తాగేందుకు ఏర్పాట్లు చేయడం వలన నిత్యం అటువైపు వెళ్లే వందలాది మహిళలతో మందుబాబులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఒంటిమీద గుడ్డలు లేకుండా రోడ్లపై పడి ఉంటున్నారని అయినా అధికారులు మామూలు మత్తులో మునిగి తేలుతున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పక్కనే ఇంత బాగోతం జరుగుతున్నా వారు ఎందుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ రోడ్ ను ఆక్రమించి ఇన్ని షాపులు వెలిసిన కానీ ఎందుకు అధికారులు అలసత్వం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పాన్ షాపుల్లో వచ్చే వ్యర్ధాలు అన్నిటిని పక్కన ఉన్న వెంకయ్యవయ్యేరు కాలువలో వేస్తున్న ఇరిగేషన్ అధికారులకు చర్యలు చేపట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నగర పంచాయతీ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఇది ఎంతవరకు సమంజసం అని ప్రజలు అంటున్నారు. ఈ పాన్ షాపుల్లో నిషేధిత గుట్కాలు అమ్ముతున్నా కానీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వం దిశా చట్టాలను తీసుకొచ్చింది కానీ ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఆ దారి వెంబడి వెళ్లే మహిళలకు ఇంకా ఏమీ రక్షణ కల్పిస్తారని వారు అధికారులను నిలదీశారు. గతంలో కూడా ఈ పాన్ షాప్ లపై దినపత్రికలో కథనాలు వెలువడిన గాని అధికారులు ఎందుకు స్పందించలేదని దీని ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు అన్నారు. తక్షణం ఈ షాపులను తొలగించకపోతే ఉద్యమానికి వెనకాడేది లేదని మహిళలు అధికారులను హెచ్చరిస్తున్నారు. ఇంత జరుగుతున్న పాన్ షాప్ యజమానులు మాత్రం మాకు అధికారుల, రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని మమ్ములను ఎవరు ఏమీ చేయలేరని వారు బహిరంగంగా చెప్పడం కోస మెరుపు. ప్రభుత్వ మద్యం షాపులు ప్రక్క ఎటువంటి పాన్ షాపులు ఉండకూడదు అని నిబంధన ఉన్నప్పటికీ నిబంధనలను తుంగలోపు తొక్కి కొంతమంది రాత్రి 9 గంటల తర్వాత అధిక రేట్లకు మద్యం అమ్మకాలను చేపట్టి అక్కడే సిట్టింగ్ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని వారు వ్యాఖ్యానించారు. ఇకనైనా అధికారులు స్పందించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాన్ షాపును అక్కడ నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.