Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బలవన్మరణాలు తగ్గేలా ప్రజలను చైతన్య పరిచే కధనాలు విస్తృతంగా రావాలి…

మానసిక సమస్యలకు టెలి మానస్ 14416 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలి…

జిల్లా కలెక్టర్ వె .ప్రసన్న వెంకటేష్….

విశాలాంధ్ర -ఏలూరు: సమస్య ఎంత పెద్దదైన తీవ్రంగా ఆలోచించకుండా ప్రతి సమస్యకు పరిష్కారం వుంటుందన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తిస్తే బలవన్మరణాలకు తావుండదని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు.స్థానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో శనివారం ఆత్మహత్యలు నిరోదించడంపై వైద్య, ఆరోగ్య శాఖ,క్రైం రిపోర్టింగ్ చేసే మీడియా ప్రతినిధులు,తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వె .ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఆత్మహత్యలు నిరోధించడంలో కుటుంబ సభ్యులు , స్నేహితులు , ప్రభుత్వంతో పాటు మీడియా కూడా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి ఆత్మహత్య మరణం వారి చుట్టూ ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు.బలవన్మరణాలు తగ్గేలా ప్రజలలో అవగాహన పెంపొందించడం, ప్రత్యామ్నాయ చర్యలను ప్రోత్సహించడం ద్వారా ఆత్మహత్యల సంఘటనలను తగ్గించవచ్చన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వంతో పాటు మీడియా కూడా కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఈ మరణాలను తగ్గించవచ్చన్నారు. సమస్యల్లో ఉన్న వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చని పలువురు నిపుణులు చెబుతున్న అంశాలు మీడియా ద్వారా విస్తృతం పరచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మానసిక వేదనతో బాధ పడుతున్న వారిని సన్నిహితులు , స్నేహితులు గుర్తించేలా అవగహన పరచడంలో మీడియా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం వుందన్నారు . వారిని వేధిస్తున్న సమస్య నుంచి బయటపడేసే మార్గాలను చూపించే మానసిక నిపుణుల సూచనలు, సలహాలు తరచూ పత్రికల్లో తమ కథనాలతో ప్రచురించి ఆత్మహత్యల నివారణకు దోహద పడాలన్నరు. వారిలో మనోధైర్యం కల్పించాలన్నారు. అవసరమైతే సైకియాట్రిస్టులు , సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ ఇప్పించేల చైతన్య పరచాలన్నరు . ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడే వారి సమస్యకు పరిష్కారాలున్నాయని , మరణమే శరణ్యం కాదని విశదీకరించి చెప్పాలన్నారు. అప్పుడే వారు ఆత్మహత్య చేసుకోవాలన్న భావన నుంచి బయటకొచ్చి మామూలు మనుషులుగా మారతారని నిపుణులు చెబుతున్న విషయాలను వెల్లడించాలన్నారు . పదవ,ఇంటర్ పరీక్షల ఫలితాలు రాబోతున్న తరుణంలో విద్యార్థుల్లో ఆత్మస్థయిర్యం కలిగించే రీతిలో విస్తృతంగా కథనాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఆర్ బిఎస్ కె జిల్లా కో-ఆర్డినేటర్ డా. సిహెచ్. మానస మాట్లాడుతూ పత్రికలలో ఇచ్చే నివేదికలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.ఆత్మహత్య గురించిన కథనాలను ప్రముఖంగా, అనవసరంగా పునరావృతం చేయకూడదని,ఉపయోగించిన పద్ధతిని,ప్రాంతాన్ని స్పష్టంగా వివరించకూడదని, ఫొటోస్, వీడియో ఫుటేజ్ లేదా సోషల్ మీడియా లింక్‌లను ఉపయోగించకూడదని సూచించారు.అలా వివరించడం ద్వారా అప్పటికే మానసికంగా ఒత్తిడికి గురి అవుతున్నవారికి ఆత్మహత్య ఒక పరిష్కారంలా అవగతమవుతుందని తద్వారా ఇది మరిన్ని మరణాలకు దారి తీస్తుందన్నారు.ముందుగా మానసిక ఒత్తిడి అనేది సహజమేనని అందరు గుర్తించాలన్నారు.ఒత్తిడిని జయించడానికి అనేక మార్గాలు ఉన్నాయని,వైద్యులను కూడా సంప్రదించవచ్చని లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఁటెలి మానస్ ఁ టోల్ ఫ్రీ నెంబర్ 14416 కి కూడా ఫోను చేయవచ్చన్నారు.ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, తీవ్ర భయాందోళనలు,మాదకద్రవ్య దుర్వినియోగం, ఆత్మహత్య ఆలోచనలు, మానసిక సమస్యలతో ఉన్న వారు ఎవరైనా ఈ టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించడం ద్వారా విలువైన సలహాలు సూచనలు పొందవచ్చన్నారు. ప్రతి ఆత్మహత్యకు కథనాన్ని ప్రచురించేటప్పుడు నిపుణులు ద్వారా ఆ సమస్యకు ప్రత్యామ్నాయాన్ని కూడా సూచించాలని,టెలి మానస్ టోల్ ఫ్రీ నంబర్ను కూడా ప్రచురించాలని కోరారు.ఈ విధంగా ఆత్మహత్య ఆలోచనలతో ఉన్న వారికి ప్రత్యామ్నాయాన్ని చూపించడం ద్వారా వారికే కాకుండా వారి కుటుంబానికి మరియు సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. డి. ఆశా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img