Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి విజయానికి కృషి చేయాలి

విశాలాంధ్ర – ఏలూరు : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి పట్టం కట్టడం ద్వారా ప్రజలు తమ అభిమతాన్ని తేటతెల్లం చేశారని, ఇదే కఠోర దీక్షా సంకల్పంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా టిడిపి విజయానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పోరాడాలని టిడిపి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి బడేటి చంటి పిలుపునిచ్చారు. ఏలూరు పవర్ పేట లోని టిడిపి కార్యాలయంలో ఉగాది సంబరాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జై కేతనం ఎగురవేసినందుకు విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ సైకో పోవాలి సైకిల్ రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడమే నిదర్శనమన్నారు. వైసీపీ రాక్షస పాలనను ప్రజల ముందు ఆవిష్కరించడంలో టిడిపి చేసిన పోరాటాలు, ఆందోళనలు ప్రజల మనసుల్లో ఏ విధంగా చొచ్చుకుపోయాయో ఈ విజయం నిరూపించిందన్నారు. ఇదే కసితో రానున్న రోజుల్లో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా ముందుకు సాగుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉంటే ఎన్నికల్లో ఏ తీర్పు ఇవ్వాలన్నది వారే నిర్ణయిస్తారని అభిప్రాయపడ్డారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారికి ధైర్యం చెప్పడంతో పాటు, రాష్ట్రంలో సంక్షేమ పాలన ఆవశ్యకతను వివరిస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు మించి ఘనమైన తీర్పు ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని బడేటి చంటి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయానికి పార్టీ అధినేత చంద్రబాబు నిబద్ధత ఎంతగానో తోడ్పడిందని, అదే నిబద్ధతను మనం అందరం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వెలుగుల పండగగా ఉగాదిని జరుపుకునేందుకు ఈ ఉగాది రోజునే టిడిపి విజయానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులు కావాలన్నారు. టిడిపి చారిత్రాత్మక విజయం ఎంత అవసరమో ప్రజలు గుర్తించారని ఈ సంవత్సర కాలంలో వారికి అండగా ఉంటే సైకో పాలనకు వారే ముగింపు పలుకుతారని బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సైకో పోవాలి సైకిల్ రావాలి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జై కేతనం, ఇది ఆంధ్రుల విజయం పేరిట ముద్రించిన పోస్టర్లను బడేటి చంటి, ఇతర నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్ బాబు,చోడే వెంకటరత్నం,దాసరి ఆంజనేయులు, పెద్ది బోయిన శివప్రసాద్,నేరుసు గంగరాజు దాకారపు రాజేశ్వరరావు, బెల్లంకొండ కిషోర్ , టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img