Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

దుర్గారావు మృతికి కారకులపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి

కొయ్యలగూడెం : పొంగుటూరు గ్రామానికి చెందిన కొల్లూరు దుర్గారావు మృతికి కారకులైన ఎస్‌ఈబి పోలీస్‌ వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి, అరెస్టు చేసి మృతుని కుటుంబానికి రూ.50లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని కొయ్యలగూడెం మండల కిరాణా వర్తక సంఘం డిమాండ్‌ చేసింది. పొంగుటూరు గ్రామంలో ప్రధాన రహదారిపై కిరాణా వర్తక సంఘం, ఆర్యవైశ్య జిల్లా నాయకులు, మండల నాయకులు బుధవారం ధర్నా కార్యక్రమం చేపట్టి, ఆందోళన నిర్వహించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పొంగుటూరు గ్రామానికి చెందిన కొల్లూరు దుర్గారావు(55) గ్రామంలో చిన్న కిరాణా వ్యాపారం చేస్తూ ఉంటాడని ఈనెల 5వ తేదీ శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఎస్‌ఈబి పోలీసులు కిరాణా షాపు వద్దకు వచ్చి సారా తయారు చేసే వారికి బెల్లం అమ్ముతున్నాడనే నెపంతో జంగారెడ్డిగూడెం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ కు రావాలని దుర్గారావు ను ఎస్‌ఈబి పోలీసులు తీసుకువెళ్లారు. శుక్రవారం రాత్రి జంగారెడ్డిగూడెం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద నుండి బాత్రూంకి వెళ్ళాలని దుర్గారావు ఎక్సైజ్‌ స్టేషన్‌ ఉన్న సిబ్బందిని అడగడంతో అక్కడి నుండి బయటకు వచ్చి దుర్గారావు పారిపోయాడని వారి కుటుంబ సభ్యులకు ఎస్‌ ఈబి పోలీసులు సమాచారం అందించారన్నారు. మూడవరోజు మంగళవారం ఉదయం గం. 10.30 నిమిషాల సమయంలో ఏలూరు రైల్వే పోలీసులు రైలు ఢీకొని దుర్గారావు మృతిచెందాడని దుర్గారావు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో అతని కుటుంబ సభ్యులు ఏలూరు రైల్వే స్టేషన్‌ కు, వెళ్లి అక్కడి నుండి దుర్గారావు మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్లినప్పటికీ. అక్కడ ఉన్న ఎస్‌ఈబి సిఐ దుర్గారావు మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్‌ లో ఎక్కించుకొని మృతుని కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా మృతుని స్వగ్రామమైన పొంగుటూరు గ్రామానికి తీసుకువచ్చి పోలీసులకు అప్పగించడంతో మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం సిఐ బాల సురేష్‌ నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ప్రజలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, కిరాణా వర్తక సంఘం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ఇన్చార్జి డిఎస్పి జేవీ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టిన వారితో మాట్లాడి డిమాండ్లను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, న్యాయం జరిగేలా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళనకారులు ధర్నా విరమించుకున్నారు. ఈ ధర్నాలో వెలగల శ్రీరామమూర్తి, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నుదురు మాటి శ్రీనివాస్‌, కోన శ్రీనివాస్‌, మండల ఆర్యవైశ్య సంఘ నాయకులు బొమ్మ మోహనరావు, మటూరు సుధీర్‌, బొమ్మ బాబు తదితరులు ఉన్నారు. అనంతరం కొయ్యలగూడెం ఎస్సై విష్ణువర్ధన్‌, లక్కవరం ఎస్‌ఐ సతీష్‌ కుమార్‌, జంగారెడ్డిగూడెం ట్రాఫిక్‌ ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img