విశాలాంధ్ర – కొయ్యలగూడెం : కొయ్యలగూడెం పట్టణంలోని ప్రధాన సెంటర్లో నూతనంగా నిర్మించిన జాతీయ రహదారి మధ్యలో డివైడర్ పై ఏర్పాటుచేసిన ప్రమాదాల హెచ్చరిక లైట్ల స్తంభాలు, విరిగిపోయి పడిపోవడంతో రాత్రి వేళల్లో డివైడర్ కనపడక వాహనదారులు పలు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాల నివారణకు పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాల వారు డివైడర్ వద్ద ద్విచక్ర వాహనాల టైర్లను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లు కూడా వెలగడం లేదని పట్టణవాసులు పేర్కొంటున్నారు. జాతీయ రహదారి ఎన్ హెచ్ (5). 554 నెంబర్ గా ఉన్న తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారి నిర్మాణం గుత్తేదారులు అంతంత మాత్రంగానే అరకొర వసతులతో పూర్తి చేశారని, నాణ్యత పాటించకపోవడం వలన ప్రమాదాల హెచ్చరిక తెలిపే స్తంభాల లైట్లు విరిగిపడిపోయాయని పట్టణవాసులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు డివైడర్ కు ఇరువైపులా లైట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు, వాహన చోదకులు కోరుతున్నారు.