ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..
విశాలాంధ్ర -భీమవరంటౌన్ : నియోజకవర్గ పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన లేఔట్లలో కొన్ని చోట్ల పూడిక పనులు జరిగి లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేసుకుంటున్నారని, మరికొన్ని చోట్ల పూడిక పనులు జరగపోవడంతో అధికారులు వెంటనే పూడిక పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆదేశించారు. ఈ మేరకు స్థానిక క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం హౌసింగ్ అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వేసవికాలం దృష్ట్యా పూడిక పనులు జరగడానికి వాతావరణం అనుకూలంగా ఉంటుందని కాబట్టి వెంటనే పూడిక పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారులు ఎక్కడెక్కడ, ఎంతవరకు గృహ నిర్మాణాలు ప్రారంభించారనేదానిపై నియోజకవర్గ పరిధిలో గ్రామాలు వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. భీమవరం పట్టణంలోని విస్సాకోడేరు లేఔట్ లో ప్రస్తుతం 2 వేల మంది వరకు లబ్ధిదారులు గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న నేపథ్యంలో మిగిలిన వారు కూడా త్వరితగతిన గృహ నిర్మాణాలు ప్రారంభించుకునే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ పిడి జి పిచ్చయ్య, వీరవాసరం తాసిల్దార్ ఎం సుందర్ రాజు, ఈఈ బి వెంకటరమణ లు పాల్గొన్నారు.