Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నాయకత్వ శిక్షణా శిబిరం

ఏలూరు:స్థానిక సెయింట్ థెరిసా కళాశాలలో విద్యార్థినులకు బుధవారం నాయకత్వ లక్షణాలపై శిబిరం నిర్వహించారు. ఎం ఆర్ ఫౌండేషన్,ఫార్మ్ ఆఫ్ ఫ్రీ ఎంటర్ప్రైజెస్ వారు డిగ్రీ కళాశాలతో సంయుక్తంగా నాయకత్వ శిబిరం నిర్వహించారు. శిబిరానికి ముఖ్య వక్తగా వివేక్ పాటిల్, రాజీవ్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన సరైన నాయకత్వం సరైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం చాలా ముఖ్యమన్నారు. నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం ఆత్మవిశ్వాసం అన్నారు. తానున్న పరిస్థితుల పై ఆకళింపు, లక్ష్యాల గుర్తింపు, తీసుకునే నిర్ణయం తో గమ్యం చేరగలననే ధైర్యం ఉంటేనే రాణించగలుగుతారన్నారు. నాయకత్వ స్థాయికి ఎదగాలంటే ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశించుకుని తర్వాత పెద్ద లక్ష్యాలను చేరుకునేలాగ సాధన చేయాలన్నారు. బృందంలోని సభ్యులు ప్రతిభను నాయకుడు గుర్తించగలగాలన్నారు. అందరు సభ్యుల్ని సమానంగా గౌరవించడం ఉత్తమ నాయకుడి లక్షణం అన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ నాయకుడు స్వయంగా సృజనాత్మకతను పెంపొందించుకుంటూ బృంద సభ్యులను కూడా ప్రోత్సహించాలన్నారు. పనిలో ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకునే నేర్పు నాయకుడికి ఉండాలన్నారు.
కళాశాల సోషల్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ పి. రత్న మేరీ, అధ్యాపకులు డాక్టర్ ఎస్తేరు కళ్యాణి, డాక్టర్ జోసెఫిన్ లు కార్య క్రమం నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ రజిత విద్యార్థినులకు భవిష్యత్తులో ఉపయోగపడే మంచి శిబిరం నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img