Monday, September 26, 2022
Monday, September 26, 2022

మోడీ అసమర్ధ పాలన… ప్రత్యామ్నాయ ప్రభుత్వం తేవాలి

బిజెపి, వైసీపీలను గద్దె దింపాలి

ఏలూరు: కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ అసమర్థ పాలకులుగా ముద్ర వేసుకున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. బుధవారం ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని సిపిఐ జిల్లా ప్రధమ మహాసభల ప్రతినిధుల సభ రెండవ రోజు శ్రీకాశీవిశ్వేశ్వర కళ్యాణ మండపం నందు ప్రారంభం అయింది.తొలుత సిపిఐ సీనియర్ నాయకులు కొమ్మన నాగేశ్వరరావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. చింతలపూడి సిపిఐ నాయకులు బొడా వజ్రం మృత వీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. సన్నేపల్లి సాయిబాబ, తుర్లపాటి బాబు, కొండేటి బేబి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత మహాసభ నుండి ప్రస్తుత మహాసభ వరకు మరణించిన నాయకులకు, సభ్యులకు సంతాపం తెలియజేస్తూ సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం జరిగిన ప్రతినిధుల సభలో రామకృష్ణ మాట్లాడుతూ హిట్లర్ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఒకటేనన్నారు. మోడీ అధికారం చేపట్టిన తర్వాత అశాస్త్రీయమైన విధానాలు అవలంబిస్తున్నారన్నారు.ఉపాధి కోసం వలసలు వెళ్లిన 12 కోట్ల మంది కరోనా కష్టకాలంలో తిరిగి రావడానికి అవకాశం ఇవ్వకుండా లాక్ డౌన్ ప్రకటించారన్నారు. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. ఇతర దేశాలలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వాలు తమ దేశంలో ఉన్న డాక్టర్లను విదేశాలకు పంపి సేవలు అందజేశారని తెలిపారు. దేశంలో కరోనా మరణాలకు లెక్కలు లేవన్నారు. చైనాకు, భారత్ కు సంవత్సరం తేడాతో స్వాతంత్రం సిద్ధించిందని 75 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో మన దేశం 3.3ట్రిలియన్ డాలర్ల ఆదాయంతో ఉండగా చైనా 16ట్రిలియన్ డాలర్ల ఆదాయంతో అమెరికాతో పోటీ పడుతూ ప్రపంచ దేశాలను శాసిస్తుందన్నారు. మోడీ, అమిత్ షా పాలనలో కులాలు, మతాలు లెక్కలు వేస్తూ ఓట్ల కోసం సరికొత్త ప్రణాళికలు రక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడవేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2019లో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేస్తుందన్నారు. రాజకీయ పార్టీలను, నాయకులను భయబ్రాంతులకు గురి చేస్తూ అద్వాన్న పాలన చేస్తున్నారని విమర్శించారు. ఆర్టికల్ 370ని రద్దు చేశారన్నారు. బిజెపిని గద్దె దించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పాలనను గాలికి వదిలేసారన్నారు. జగన్ తన పాదయాత్రలో మధ్య నిషేధాన్ని అమలు చేస్తానని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 20 శాతం మద్యం షాపులు తగ్గిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధం పేరుతో జగన్ బ్రాండ్లను విక్రయిస్తున్నారని ఆరోపించారు. తన మద్యం బ్రాండ్ల అమ్మకాల ద్వారా రూ.6 వేల కోట్ల ఆదాయాన్ని సంపాదించారాన్నారు. రాష్ట్రంలోని సంపదను అదానికి దోచిపెడుతున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై రూ.10 సెస్సు వేసి సంవత్సరం అంతా వసూలు చేసి ఆటోవాలాలకురూ.10 వేలు వేస్తున్నారని రాష్ట్రంలో తొమ్మిది లక్షల ఆటోవాలాలు ఉంటే ప్రభుత్వం 2 లక్షల 50 వేల ఆటోలకు మాత్రమేరూ.10 వేలు వేస్తున్నారన్నారు.కేంద్రం, రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని బలమైన పోరాటాల ద్వారా సిపిఐ శ్రేణులు కలుషిత రాజకీయాలను రూపుమాపాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీలు బలపడటానికి సరైన అవకాశం వచ్చిందన్నారు. ప్రజల భావన మార్చాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
ప్రత్యామ్నాయ ప్రభుత్వం తేవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర 27వ మహాసభలు ఈనెల 26, 27, 28 తేదీలలో విశాఖలో జరుగుతున్నాయన్నారు. ఈ మహాసభలలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, విశాఖకు ఉక్కు, గంగవరం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, రైతాంగ, ఉద్యోగ, కార్మిక సమస్యలపై చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జాతీయ మహాసభలు అక్టోబర్ 14 నుండి 18 వ తేదీ వరకు విజయవాడలో జరుగుతున్నాయని ఈ మహాసభలలో ఆర్ఎస్ఎస్, బిజెపి ఫాసిస్టు పోకడలను ఎదుర్కోవడంపై ప్రధాన అజెండగా జరుగుతుందన్నారు. రాష్ట్ర జాతీయ మహాసభలకు సిపిఐ శ్రేణులు, ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి గత మహాసభ నుండి ప్రస్తుత మహాసభ వరకు జరిగిన పార్టీ కార్యకలాపాలపై నివేదిక సమర్పించగా ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ ప్రతినిధుల సభలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు, కార్యదర్శి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ, కార్యవర్గ సభ్యులు చలసాని వెంకట రామారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పులూరి హేమ శంకర్, పుప్పాల కన్నబాబు, మన్నవ కృష్ణ చైతన్య,
బత్తుల వెంకటేశ్వరరావు, కారం దారయ్య, సోదెం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img