

వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి
మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని
విశాలాంధ్ర ఏలూరు: చంద్రబాబు కోసమే పవన్ ఆరాటం, పోరాటం అని ఉప ముఖ్యమంత్రి, శాసనసభ్యులు ఆళ్ల కాళీక్రిష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) విమర్శించారు. సోమవారం స్థానిక సారధి కళ్యాణ మండపంలో వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్లపై నిందారోపణలతో, నీచంగా మాట్లాడటం పవన్ అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. నీ కంటే క్రిమినల్ ఎవరున్నారని పవన్ ను ప్రశ్నించారు. నీ గెలుపు మీదే నీకు నమ్మకం లేకపోతే నీ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా నిన్ను నమ్ముతారన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను గద్దె దించి ఎవరిని గద్దెనిక్కిస్తాడో చెప్పే ధైర్యం లేని వ్యక్తి పవన్ అని ఎద్దేవా చేశారు. జగన్ ను ఏక వచనంతో పిలిచే అర్హత నీకు లేదన్నారు. ఎన్ని జన్మలు ఎత్తినా జగన్ స్థాయికి చేరుకోలేవని విమర్శించారు.
రాజకీయ అవగాహన లేని పవన్
వారాహి అపజయ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదివారం తన కార్యకర్తలతో రాజకీయ పార్టీ గురించి, తమ పార్టీ ఏ విధంగా బలపడిందో కార్యకర్తలకు వివరించే ప్రయత్నం చేయకుండా కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేశారని విమర్శించారు. ప్రభుత్వ పనితీరుపై బురద జల్లే ఆరోపణలు, ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలకే పవన్ పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజాప్రతినిధులను దుర్భాషలాడుతూ, మీరు కూడా నాకు ఓట్లు వేయరు అని అనడం తన అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. వారాహి యాత్రను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, రాష్ట్రంలో ప్రజా సేవలు అందించే వాలంటీర్లను సంఘ విద్రోహశక్తులుగా పోల్చడంతో పవన్ కళ్యాణ్ నైజం బయటపడిందన్నారు. వరదలు, కరోనా వంటి వైపరీత్యాలను లెక్కచేయకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న వాలంటీర్లను అవమానపరిచిన పవన్ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ సాక్షిగా పవన్ అబద్దాలు, అబాండాలు జగన్ పై మోపారన్నారు . ప్రజా సమస్యలపై ఎటువంటి అవగాహన లేని పవన్ చంద్రబాబు స్క్రిప్టును చదువుతున్నాడని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి జగన్ ఒక మేరు పర్వతం అని ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజల అభిమానం నుంచి దూరం చేయలేరన్నారు. వారాహి యాత్రను ప్రజలు అడ్డుకునే పరిస్థితి పవన్ తెచ్చుకున్నాడని హెచ్చరించారు. వాలంటీర్లను, ప్రజా ప్రతినిధులను, వదిలిపెట్టకుండా పవన్ కళ్యాణ్ దూషిస్తూ ప్రజలను వంచనకు గురి చేస్తున్నాడన్నారు. ఒక రాజకీయ సిద్ధాంతం, లక్ష్యం లేకుండా వారాహి యాత్ర పేరుతో ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్న పవన్ కళ్యాణ్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ఇకనైనా పవన్ తన వైఖరిని మార్చుకుని దూషణ పర్వాలు ఆపాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో వారాహి యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఇడ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్, సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, డిప్యూటీ మేయర్లు గుడిదేసి శ్రీనివాస్, నూక పెయ్యి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ చిరంజీవులు, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచెం మైబాబు, కో ఆప్షన్స్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్ గురునాథ్, వైసిపి నగర అధ్యక్షులు బి శ్రీనివాస్, నాయకులు మధ్యాహ్నపు బలరాం, కార్పొరేటర్లు, పార్టీ అనుబంధాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.