Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

కబ్జా కోరల్లో ఉన్న బాపిరాజు చెరువును కాపాడండి

బీసీ నేత గేదెల నరసింహులు

విశాలాంధ్ర – ఉండి: కబ్జా కోరల్లో ఉన్న బాపిరాజు చెరువును కాపాడి గ్రామపంచాయతీ స్వాధీనం చేసుకోవాలని బీసీ నాయకులు గేదెల నరసింహులు వినూత్నంగా చెరువులో దిగి నిరసన చేపట్టారు. మంగళవారం ఉదయం బాపిరాజు చెరువులో దిగి బాపిరాజు చెరువును గ్రామపంచాయతీ స్వాధీనం చేసుకోవాలని గత 6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి పెత్తందారులకు దాసోహం చేస్తూ గ్రామంలోని ప్రజలకు తీరని అన్యాయం చేస్తు నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండి మండలం పెద్దపుల్లేరు గ్రామం నడిబొడ్డిలో గ్రామపంచాయతీకి చెందిన 53 సెంట్లు కలిగిన బాపిరాజు మంచి నీటి చెరువు కబ్జా కోరల్లో ఉందని మే 15వ తేదీన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా గ్రామపంచాయతీ కార్యదర్శి పట్టించుకోకుండా ఫిర్యాదును చెత్తబుట్టలో పారేసాడని వాపోయారు. ముఖ్యమంత్రి జగన్ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం చూపిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని కానీ క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. స్పందన ఫిర్యాదును సైతం ధిక్కరిస్తూ బడా బాబులకు ఊడిగం చేస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని గేదెల నరసింహులు డిమాండ్ చేశారు. ఇంతవరకు ఈ చెరువును ఆక్రమించిన కబ్జాదారుల వద్ద నుండి అపరాధ రుసుమును పంచాయతీ పాలకపక్షం వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాను దీక్ష విరమించేది లేదని చెరువును శుభ్రం చేసి పంచాయతీ స్వాధీనం పరుచుకునే వరకు తన దీక్ష కొనసాగుతుందని తెలిపారు. ఉదయం నుండి ఒక వ్యక్తి చెరువులో దిగి దీక్ష చేస్తున్నప్పటికీ సాయంత్రం గం. 6అయినా అధికారులు ఎందుకు స్పందించడం లేదని అధికారులు ఎవరికి భయపడుతున్నారో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇదే కార్యదర్శి మేడవరం మంచినీటి చెరువును బాగు చేయించడంలో నిర్లక్ష్యం వహించడంతో స్థానికులు కొందరు చెరువులో దిగి దీక్ష చేయడం విశేషం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img