ఏలూరు: వైసిపి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు సూచించారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి బడేటి చంటి తో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్న పార్టీ అధినేత చంద్రబాబు వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ టిడిపి అధికారంలోకి వస్తే పరిష్కారిస్తామన్న నమ్మకం కలుగజేయాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై నిత్యం పోరాడలన్నారు. పార్టీ శ్రేణులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారిలో ఆత్మస్థైర్యం నింపాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బడేటి చంటి కి పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు.