Friday, December 1, 2023
Friday, December 1, 2023

ఎమ్మెల్యేను స్టేజి పైకి ఎక్కనివ్వకుండా అడ్డుకుంటున్న వైసీపీ కార్యకర్తలు..

ప్రోటోకాల్ రగడ…
యుద్ధ వాతావరణం తలపించిన టిడ్కో ఇళ్ల పంపిణీ….
తోపులాటలో స్టేజిపై నుంచి జారిపడ్డ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు….

పాలకొల్లు: పాలకొల్లులో శుక్రవారం నిర్వహించిన టిడ్కో ఇళ్ల పంపిణీ రసాభసగా మారింది. యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ప్రోటోకాల్ ప్రకారం పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కు సభాధ్యక్షత స్థానం ఇవ్వాల్సి ఉంది. ఇదే విషయం ఇళ్ల ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకంపై కూడా పేర్కొనాలి. శిలాఫలకంపై సభాధ్యక్షత స్థానంలో తన పేరు లేదని ఎమ్మెల్యే నిమ్మల గమనించి ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. ఎమ్మెల్యే రామానాయుడు అధికారులను ప్రశ్నించినా సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున వైసిపి, టిడిపి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు ప్రతి నినాదాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పరిస్థితుల్ని చక్కదిద్దాలని ప్రయత్నించినప్పటికీ గొడవ ఏమాత్రం తగ్గకుండా మరింత ముదిరింది. టిడ్కో ఇళ్ల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు వచ్చినప్పటికీ వారిని పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు సర్వత్ర వినిపించాయి. ఒక దశలో ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ లు స్టేజి పై నుండి తూలి కింద పడిపోయారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ నేతలు, కార్యకర్తలు టిడిపి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను స్టేజి పైకి రాకుండా అడ్డుకున్నారు. వైసిపి పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొత్తం మీద అతి కష్టంగా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం మొదలైంది. స్టేజి మీద వివిధ స్థాయిలలో ఉన్న సీనియర్ నాయకులు ఆసీనులై ఉన్నప్పటికీ, కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మాత్యులు కొట్టు సత్యనారాయణ, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్, ఈ ఇద్దరు మంత్రులు మాత్రమే నిండు సభలో కాసేపు మాట్లాడారు. వీరు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక ముగ్గురు లబ్ధిదారులను స్టేజి పైకి పిలిచి, పసుపు కుంకుమ, చీర ఇంటి దస్తావేజులను అందజేసిన వెంటనే ఊహించని విధంగా స్టేజి దిగి కిందికి వెళ్లిపోయారు. ఈ మంత్రులతో పాటు, జడ్పీ చైర్మన్ తో సహా, స్టేజి మీద ఉన్న వివిధ పదవుల్లో ఉన్న ప్రముఖులు స్టేజి దిగిపోయారు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ను మాట్లాడనివ్వకూడదనే ఉద్దేశంతోటే వారంతా ప్రణాళిక ప్రకారం ముందే అనుకుని స్టేజి పైనుండి దిగిపోయారని ప్రజలలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అధికార పార్టీ వైఖరి పట్ల ఎమ్మెల్యే నిమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడికి మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరు అంటూ ప్రశ్నించారు. ప్రోటోకాల్ విస్మరిస్తుంటే అక్కడ ఉన్న అధికారులు ప్రేక్షక పాత్ర వహించారని, ఈ విషయంపై తాను కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రభుత్వ కార్యక్రమమా లేక వైసీపీ కార్యక్రమమా తెలియచేయాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ సభలో ఎమ్మెల్యే నిమ్మలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఆ ఇద్దరు మంత్రులు తప్ప మిగిలిన వారు ఎవరూ టిడ్కో లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడకపోవడం, సైలెంట్ గా సభా ప్రాంగణం నుండి దిగి కిందికి వెళ్లిపోవడం శోచనీయంగా ఉందని ప్రజలు అంటున్నారు. తనకు జరిగిన అవమానంపైఎమ్మెల్యే నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img