Homeసంపాదకీయంరాజకీయ చిత్తశుద్ధి ఏదీ?

రాజకీయ చిత్తశుద్ధి ఏదీ?

- Advertisement -

బీసీ రిజర్వేషన్లు… ఓ బ్రహ్మపదార్థం. అంతుచిక్కని రహస్యం. అందరూ దీని గురించి మాట్లాడుకుంటారు. అన్నీ తెలుసని అనుకుంటారు. ఏదో చేయాలని తపిస్తున్నట్లు నటిస్తారు. చివరకు ఏమీ కాదు. 75 ఏళ్ల గణతంత్ర భారతంలో ఒక జడపదార్థంలా మారిన ప్రక్రియ ఏదైనా ఉందంటే అది బీసీ రిజర్వేషన్లు మాత్రమే. దీనికి న్యాయపరిమితి ఉందని తెలిసినా ఏ ఒక్క రాజకీయ పార్టీ దీన్ని వ్యతిరేకించదు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేస్తున్నామంటూ ప్రకటనలు చేస్తూ, చివరకు న్యాయస్థానంపైకి నెట్టేస్తూ ఉంటారు. ఈ తంతు… కొత్త వింతేమీ కాదు. సకల కళా వల్లభులు, సకల కళా పోషకులూ..ఇద్దరూ కలిసి రంగరించి, రంగస్థలాన్ని రంజుగా మార్చడానికి ఎంచుకున్న ఓ ఉమ్మడి అంశమిది. ఈ ఆటలో వెనుకబడిన కులాల వారు పావులుగా మారి బలవుతూ ఉంటారు. ఆది నుంచీ అన్నీ ఉన్న అగ్రకులాల వారు అదే బలంతో కొనసాగవచ్చు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లతో ఎస్‌సీ, ఎస్‌టీలు బలిష్ఠంగానూ మారవచ్చు. మధ్యలో ఎటూకాకుండా పోయిన బీసీలు మాత్రం అలాగే ఉండాలి, ఉండి తీరాలి. ఇదీ రాజనీతి!
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడం న్యాయపరంగా అనూహ్యమేమీ కాకపోయినా, రాజకీయంగా మాత్రం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించరాదన్న సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులకు ఈ జీవో విరుద్ధమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. దశాబ్దాలుగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తెరపైకి వచ్చే ఈ రిజర్వేషన్ల అంశం న్యాయ సూత్రాలు, సామాజిక న్యాయం, ఎన్నికల వ్యూహాల మధ్య నలిగిపోతోందనడానికి తాజా పరిణామం తిరుగులేని నిదర్శనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994 పంచాయతీరాజ్ చట్టం ద్వారా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. అయితే, ఎస్‌సీ (సుమారు 19.08%), ఎస్‌టీ (సుమారు 6.77%) రిజర్వేషన్లతో కలిపి చూస్తే మొత్తం కోటా 59.85 శాతానికి చేరేది. 1992 నాటి చారిత్రక ‘ఇందిరా సాహ్ని’ కేసు మొదలుకొని, స్థానిక సంస్థల రిజర్వేషన్లపై 2010లో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ‘కె.కృష్ణమూర్తి’ తీర్పు, అనంతరం 2021 నాటి ‘వికాస్ కిషన్ రావ్ గవాలీ’ తీర్పుల వరకు సుప్రీంకోర్టు ఒకే మాటను పునరుద్ఘాటించింది. స్థానిక సంస్థల్లో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు కేటాయించే మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదు. గతంలోనూ (2020లో) ఏపీలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి మించడంతో న్యాయస్థానాలు అడ్డు చెప్పగా, బీసీ కోటాను తాత్కాలికంగా తగ్గించి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అయినప్పటికీ, శాస్త్రీయ అధ్యయనం లేకుండా మళ్లీ పాత విధానాన్నే తీసుకురావడం కోర్టుల్లో నిలబడలేకపోయింది. అంటే రిజర్వేషన్ల నేపథ్యం తెలిసినా, న్యాయ పరిమితులున్నాయని మొత్తుకుంటున్నా…మార్చి మార్చి పాతపాటే పాడుతున్నారంటే, దానర్థం బీసీలను ఏమార్చడానికేనని తెలుస్తోంది. రాజ్యాంగం ఏం చెబుతోందో రాజకీయనేతలకు తెలియంది కాదు. రాజ్యాంగంలోని 73, 74వ సవరణల ప్రకారం ఆర్టికల్ 243డీ, 243టీలు ఎస్‌సీ, ఎస్‌టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పనిసరి చేశాయి. కానీ బీసీల విషయానికి వస్తే, వారికి రిజర్వేషన్లు కల్పించే వెసులుబాటును మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టాయి. అంతేకాకుండా విద్య, ఉద్యోగాల్లో ఇచ్చే సామాజిక` విద్యాపరమైన రిజర్వేషన్లకు (ఆర్టికల్ 15, 16), స్థానిక సంస్థల్లో ఇచ్చే ‘రాజకీయ ప్రాతినిధ్య’ రిజర్వేషన్లకు వ్యత్యాసముందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. స్థానిక పాలనలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలంటే సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన ‘ట్రిపుల్ టెస్ట్’ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఆ మూడు అంశాల విధానమేమిటంటే, రాష్ట్రంలో వెనుకబాటు తనం స్వభావాన్ని అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయడం, స్థానిక సంస్థల వారీగా గణాంకాలను సేకరించి నివేదిక రూపొందించడం, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా పరిమితి విధించడం.
ఈ మూడు నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించకుండా ప్రభుత్వాలు జీవోలు జారీ చేస్తే, అది న్యాయ సమీక్ష ముందు నిలబడదు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సంక్షోభం లేకపోలేదు. ఈ సమస్య ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోనూ స్థానిక ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటినప్పుడు న్యాయస్థానాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంటే ఓటు బ్యాంకు కోసం ‘వేషాలు’ వేసే ప్రతిచోటా ఇది తప్పదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో డెడికేటెడ్ కమిషన్లు ఏర్పాటు చేసి నివేదికలు సమర్పించే వరకు బీసీ రిజర్వేషన్లను నిలిపివేయడం లేదా సాధారణ స్థానాలుగా మార్చి ఎన్నికలు జరపాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన ఉదంతాలున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీసీల స్థానిక రిజర్వేషన్లను 50 శాతం పరిమితికి లోబడేలా (ఉదాహరణకు 20 నుంచి 27 శాతానికి) సర్దుబాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, ఏపీ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం సామాజిక న్యాయం దృష్టితో చూస్తే సమంజసమే. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేని ప్రస్తుత తరుణంలో, స్థానిక స్వపరిపాలన మాత్రమే వారికి నాయకత్వ అవకాశాలను అందిస్తోంది. అయితే, అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను ఎందుకు పాటించడం లేదన్నదే అసలు ప్రశ్న. 50 శాతం పరిమితి దాటితే న్యాయస్థానాలు కొట్టివేస్తాయని తెలిసీ ప్రభుత్వాలు అటువంటి జీవోలు ఇవ్వడం, ఆ తర్వాత న్యాయస్థానాలను సాకుగా చూపి తప్పించుకోవడం లేదా పరస్పరం నిందించుకోవడం రాజకీయ డ్రామాగా మారుతోంది. సుప్రీంకోర్టుకు వెళితే ఏం జరుగుతుందో కూడా సర్కారీ పెద్దలకు తెలుసు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లినా ఊరట దక్కే అవకాశాలు చాలా తక్కువ. కె.కృష్ణమూర్తి కేసులో తీర్పును స్వయంగా సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనమే సమర్థించింది.
రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేస్తే తప్ప లేదా సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం 50 శాతం పరిమితిని పునఃపరిశీలిస్తే తప్ప ప్రస్తుత చట్టపరిధిలో 34 శాతం నిలబడటం కష్టం. బీసీలకు స్థానిక సంస్థల్లో న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలంటే కేవలం రాజకీయ ప్రకటనలు, ఎన్నికల వేళ జారీ చేసే తాత్కాలిక జీవోలు సరిపోవు. ప్రభుత్వం వెంటనే డెడికేటెడ్ కమిషన్ ద్వారా పక్కా లెక్కలు తేల్చి, 50 శాతం నిబంధనకు లోబడి గరిష్ట ప్రయోజనం చేకూరేలా చూడాలి. అలాగే, దేశవ్యాప్తంగా సామాజిక వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా 50 శాతం గరిష్ట పరిమితిపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ సాధించడం దీర్ఘకాలిక పరిష్కారమవుతుంది. అంతేకాని, ఎన్నికల ముందు తూతూమంత్రంగా జీవోలు ఇవ్వడం, ఆపై కోర్టులపై భారం వేయడం బీసీల రాజకీయ సాధికారతకు గొడ్డలిపెట్టు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు