టోక్యో: జపాన్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మహిళలు విజయం సాధించారు. భారీగా మహిళలు జపాన్ ప్రతినిధుల సభకు ఎన్నుకయ్యారు. అయితే 16 శాతం కన్నా తక్కువ… ఇంకా మైనారిటీలో కొనసాగుతున్నారు. 465 సీట్లు కలిగిన దిగువసభలో 73 సీట్లను మహిళలు గెలుచుకున్నట్లు ప్రభుత్వ మీడియా ఎన్‌హెచ్‌కే తెలిపింది. సోమవారం తర్వాత అధికారిక ఫలితాల్లో ఈ గణాంకాలు ధృవీకరించబడతాయని భావిస్తున్నారు. 2021 సాధారణ ఎన్నికల్లో దిగువసభకు 45 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఎన్నికల్లో మహిళలు ఎక్కువమంది పోటీ చేస్తున్నారని, దాదాపు నాలుగవ వంతు అభ్యర్థులు ఉన్నట్లు ప్రభుత్వ మీడియా, ఇతర సంస్థలు ప్రకటించాయి.
జపాన్‌లో ఇప్పటికీ వ్యాపారాలు, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉందని, 146 దేశాల జాబితాలో జపాన్ 118 ర్యాంకులో ఉన్నట్లు ప్రపంచ ఆర్థిక వేదికకి చెందిన ప్రపంచ లింగ అసమానత సూచీ నివేదిక పేర్కొంది. ప్రధాని షిగెరు ఇషిబాకి చెందిన 20 మంది సభ్యుల కేబినెట్లోనూ కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. పురుషాధిక్యత, నిష్పక్షపాతం లేని జపాన్ రాజకీయ పార్టీల్లో మహిళా అభ్యర్థులను గుర్తించడం కష్టమని గత నెలలో పాలక పార్టీ నాయకత్వ ఓటుకు ముందు ‘నో యూత్ నో జపాన్’ సంస్థ అధినేత మొమోకో నోజో చెప్పారు. 2021లో నిర్వహించిన కేబినెట్ ఆఫీస్ సర్వేలో జపాన్‌లోని మహిళా అభ్యర్థులలో నలుగురిలో ఒకరు తమ ప్రచార సమయంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు జిజి ప్రెస్ పేర్కొంది. ఆదివారం ఎన్నికల్లో ఇషిబా అధికార కూటమి ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంది. దీంతో పార్లమెంట్లో మెజారిటీని కోల్పోవచ్చని అంచనా. ఇషిబా అక్టోబర్ 1న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సాధారణ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. స్లష్ ఫండ్ కుంభకోణంతో ఆదివారం జరిగిన ఓటింగ్‌లో ఆయన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) ఆధిక్యతను కోల్పోయినట్లు మీడియా తెలిపింది.