Tuesday, October 29, 2024
Tuesday, October 29, 2024

రైతు భరోసా ఇవ్వండి

పూర్తి రుణమాఫీతో పాటు దొడ్డ వడ్లకు రూ.500 బోనస్‌
రైతు సంఘం నేతల డిమాండ్‌

విశాలాంధ్ర-హైదరాబాద్‌: బ్యాంకు రుణాలు రెండు లక్షలున్నా… ఆ పైబడి ఉన్నా రుణమాఫీ వర్తింప చేయాలని, భూ హక్కు చట్టం త్వరితగతిన చేయాలని, సన్నరకంతో పాటు దొడ్డ రకం వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర నేతలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతు సంఘం పిలుపులో భాగంగా వరంగల్‌ జిల్లా రైతు సంఘం అధ్వర్యంలో సోమవారం ఏక్‌సిలా పార్క్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు రైతులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సంఘ రాష్ట్ర నేత పశ్య పద్మ మాట్లాడుతూ… క్వింటా మొక్కజొన్నకు రూ.330, కందులు రూ.400, సోయా రూ.450, పత్తికి రూ.475, చెరుకు రూ.850, జొన్నలకు రూ.380 బోనస్‌ ఇస్తామని చెప్పిన పాలకులు ఆచరణలో అమలు చేయటంలో వైఫల్యం చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో హామీలన్నింటిని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతుల ఆశలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీళ్లు చల్లారన్నారు. వానాకాలం లో ఇవ్వమని చెప్పటంతో రైతులలో ఆందోళన పెరిగిందన్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారన్నారు. సకాలంలో రైతు భరోసా, రుణమాఫీ అమలు కాకపోతే ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి వీరగోని శంకరయ్య మాట్లాడుతూ హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పాష మాట్లాడుతూ ఆలస్యమైనా వానాకాలం, యాసంగి రెండు పంటలకు ఒకేసారి రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వజ్రాల అరుణ, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు సాయిలు, శోభ, హసీనా, రాజారాం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img