రాష్ట్ర సీఎంకు లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం జిల్లాలో గుత్తి పట్టణం సమీపంలోని పురాతన గుత్తి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ బుధవారం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….అనంతపురం జిల్లాలో గుత్తి పట్టణానికి సమీపంలో కొండల మధ్య గుత్తి కోట అతి పురాతన గిరిదుర్గంగా ఉంది అన్నారు. ఈ కోటను 1500 ఏళ్ల క్రితం బాదామీ చాళుక్యులు నిర్మించగా, విజయనగర రాజులు పట్టిష్టపరచినట్లు చారిత్రక నేపథ్యాలు వెల్లడిస్తున్నాయి అని పేర్కొన్నారు. గుత్తి పట్టణం సమీపం నుండి రెండు జాతీయ రహదారులు వెళ్తుండడంతో గుత్తి కోట పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉందన్నారు.
ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న గుత్తి కోట ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయలు, సర్ థామస్ మన్రో, హైదర్ అలీ విగ్రహాలను ఏర్పాటు చేయడంతోపాటు గుత్తి కోట చుట్టూ పార్కుల అభివృద్ధి, మ్యూజియం ఏర్పాటు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్‌పూల్స్, రిక్రియేషన్ ప్రోగ్రాములు, ఆటపాటలకు అనువైన వాటిని ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు వీలయి ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందుతుందన్నారు.
చారిత్రాత్మక గుత్తి కోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు చేపట్టవలసిందిగా లేఖలో కోరడం జరిగిందన్నారు.