Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

జోరుగా ఇంటి దొంగల బెల్టు వ్యాపారం

ప్రభుత్వ షాపుల నుంచి అడ్డదారిన మద్యం తరలింపు

  • బెల్ట్‌ షాపులకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్న సిబ్బంది
  • ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌కు అదనంగా రూ.20 వసూలు
    విశాలాంధ్ర – పరవాడ(అనకాపల్లి జిల్లా); ‘ఇంటి’ దొంగలతో మద్యం గ్రామగ్రామానా పరవళ్లు తొక్కుతోంది. వారి కక్కుర్తితో సీసాలకు సీసాలు తరలిపోతోంది. ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసే సేల్స్‌మెన్లు అడ్డదారిన మద్యాన్ని తరలిస్తూ రెండు చేతులనిండా సంపాదిస్తున్నారు. క్వార్టర్‌ బాటిల్‌కు రూ.20 అదనంగా తీసుకుని మద్యాన్ని బెల్ట్‌షాపులకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. పరవాడ మండలంలో ప్రభుత్వ మద్యం షాపులలో ఉండే కొందరు సేల్స్‌మెన్లు, సూపర్‌వైజర్లు అదనపు ఆదాయం కోసం తాము పనిచేసే షాపుల నుంచి మద్యం బాటిళ్లను బెల్ట్‌ షాపులకు చేరవేస్తున్నారు. బెల్ట్‌షాపుల నిర్వాహకులు ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌కు అదనంగా రూ.20 ముట్టజెబుతుండడంతో సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లు కక్కుర్తి పడుతున్నారు. ఓ నైట్‌ వాచ్‌మెన్ల సారద్యంలో అత్యంత చాకచక్యంగా ఈ వ్యవహారం నెరుపుతున్నారు. గత ప్రైవేట్‌ షాపుల సిబ్బందితో టీమ్‌గా ఏర్పడి ఈ బెల్టు దందాను సాగిస్తున్నారు. అధికారులు చూసీ చూడనట్లు వదిలేయడంతో వీరి అక్రమ ఆదాయానికి బ్రేకుల్లేకుండా పోయింది. గత ఐదేళ్ల కాలంలో కొంత మంది సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లు ఇలా మద్యం బాటిళ్లు ఇతరులకు చేరవేస్తూ అధికారులకు దొరికారు. వారిలో పరవాడ మద్యం దుకాణాలలో పనిచేసే వారే సగానికి పైగా ఉండడం గమనార్హం. ఇక సెలవు దినాలైన ఆగస్టు 15, రిపబ్లిక్‌ డే వంటి దినాల్లో వీరికి పండగే పండగ. ముందుగానే సరుకును వేరే చోటకు డంప్‌ చేసి అడ్డగోలుగా అధిక రేట్లకు అమ్మేస్తుంటారు. గత కరోనా లాక్‌డౌన్‌ సమయం లోను, అప్పటి పంచాయితీ, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలోను భారీగానే అర్జించారు. మిగతా రోజుల్లోను నిత్యం లక్షల్లో వ్యాపారం జరుగుతోందని కొందరు ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బందే చెబుతూ ఉంటారు. మొదట్లో అధికారులు జరిపిన దాడుల్లో తరచూ సేల్స్‌మెన్లు మద్యం తరలిస్తూ పట్టుబడుతూ ఉండేవారు. అయితే ఒక్కోసారి వారిని తప్పించే క్రమంలో ఎస్‌ఈబీ అధికారులు కూడా సంబంధంలేని వేరే వ్యక్తులపై కేసులు నమోదు చేసి సిబ్బందికి అండగా నిలిచేవారు. కొన్నాళ్ల క్రితం పరవాడ సినిమాహాల్‌ జంక్షన్‌లో గల మద్యం దుకాణంలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. అయితే మద్యం షాపుల సిబ్బందికి అధికారులకి మద్య అవగాహన ఉండటంతోనే పెద్ద ఎత్తున మద్యం తరలిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదీగాక గతంలో మద్యం బాటిళ్లను తరలిస్తూ పట్టుబడిన సిబ్బందినే తిరిగి ప్రభుత్వ మద్యం షాపుల్లో నియమించడం కొసమెరుపు. ఇటీవల ఎన్నికల సమయంలో అడపా దడపా జరిపిన దాడుల్లో నిత్యం మద్యం కేసులు నమోదు చేసిన అధికారులు కూడా ప్రస్తుతం పట్టించున్న సంధర్భాలు లేవు. సంబంధిత అధికారులు స్పంధించి ఇంటి దొంగల అక్రమ వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img