– పేద, మధ్య తరగతి ప్రజలు విజ్ఞప్తి…
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : రోగ నిర్ధారణకు అవసరమైన ఎక్స్ రే, అల్ట్రాసౌండ్, మెమోగ్రాఫీ, సిటి స్కాన్, డిజిటల్ రేడియోగ్రఫి (ఎం.ఆర్.ఐ) మొదలైన పరీక్షలను ఆరోగ్యశ్రీ లో చేర్చవలసిందిగా పేద మధ్య తరగతి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న ఆరోగ్యం శ్రీ పథకం లో రోగ నిర్ధారణ పరీక్షలు చేర్చాలని పేద ప్రజలు కోరుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం రూ. పది లక్షల నుంచి రూ.25 లక్షలు కు పెంచిన విషయం తెలిసిందే. అయినా ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు పూర్తిస్థాయిలో వినియోగం అవ్వడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం కేవలం కార్పోరేట్ ఆసుపత్రుల కే లబ్ధి కలుగుతోందని, ఏటా వేల కోట్ల రూపాయలు నిధులు వృధా తప్ప పేదలకు అనుకున్నంత ప్రయోజనం కలగట లేదని పలువురు అంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఏ రోగానికి చెప్పిన ఈ రోగం ఆరోగ్యశ్రీ లో వర్తించదు డబ్బులు కట్టుకుని వైద్యం చేయించుకోవాల్సిందే అని చెప్పడమే ఆరోగ్యశ్రీ యొక్క పథకమని, పేదలకు ఇవి ఏ విధంగా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ పథకంలో అన్ని రోగ నిర్ధారణ పరీక్షలు చేర్చాలని పేద, మధ్య తరగతి, బడుగు బలహీనవర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కనీసం 500 రూపాయలు లేదా 1000 రూపాయలు దాటితే ఏ రోగనిర్ధారణ పరీక్షలు అయిన ప్రైవేట్ ల్యాబ్ లలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు రోగ నిర్ధారణ పరీక్షలు లేకుండా ఏ డాక్టరు కూడా వైద్యం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ పరీక్షలు చేయించుకోవాలంటే కనీసం 5000 రూపాయలకు తగ్గట్లేదు అని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మారై, సిటి స్కేన్, ఎక్స్ రే, కిడ్నీ స్కానింగ్, అల్ట్రా సౌండ్, ఏంజియోగ్రామ్, ఎకో వంటి రోగనిర్ధారణ పరీక్షలను ప్రభుత్వమే ఆరోగ్యశ్రీలో చేర్పించి, పేదలు ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకే సి.ఎం., డిప్యూటీ సి.ఎం. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రోగాల కారణం గా పేద మధ్య తరగతి ప్రజలు ఆర్ధికం గా నష్ట పోకుండా కాపాడాలని, కోరుతున్నారు.