విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : దీపావళి బాణసంచా కాల్చేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు పై చోడవరం అగ్నిమాపక అధికారి బి.వి.రామస్వామి బుదవారం మీడియాకు తెలియజేసారు.
అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయంకోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలన్నారు.
బాణాసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించాలని, ఇంటి కిటికీలు,తలుపులు మూసివేయాలని తెలిపారు. పసిపిల్లలు ఉంటే ఇంటి లోపలే ఉంచాలన్నారు. పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పిల్లలు బాణాసంచా కాల్చాలని, బాణసంచా కాల్చేటప్పుడు ఒక బకెట్ నీరు మరియు ఇసుకను అందుబాటులో ఉంచుకోవలసిందిగా సూచించారు. బాణాసంచాతో ప్రయోగాలు చేయవద్దని,
అవి కాల్చేపుడు ముఖాన్ని దూరంగా ఉంచాలన్నారు. కాల్చడంలో విఫలమైన బాణసంచాను మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయవద్దని, ఫైర్ క్రాకర్‌లను వెలిగించి విచక్షణా రహితంగా బహిరంగంగా విసిరేయవద్దని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి చోడవరం హై స్కూల్ గ్రౌండ్ లో 31 మందుగుండు సామగ్రి దుకాణాలకు మాత్రమే లైసెన్సు జారే చేసినట్లు తెలిపారు. అనధికారికంగా మందు గుండు సామగ్రి విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. దీపావళి సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించి, ఆనందంగా పండుగ చేసుకోవాలని, శుభాకాంక్షలు తెలియజేశారు. తమ సిబ్బందితో 24 గంటలు కార్యాలయంలో అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.