Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

వాలంటీర్లంటే తెలుగుదేశం కూటమికి ఎందుకంత భయం….?

– చోడవరం తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ….

  • వాలంటీర్లంటే స్వచ్ఛంధ సేవకులు, వారిని కించపరిచే విధంగా మాట్లాడడం తగునా …?

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా ) : వాలంటీర్లు అంటే టి.డి.పి. కూటమికి ఎందుకంత భయమని అనకాపల్లి జిల్లా చోడవరం తాజా మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ ప్రశ్నించారు. స్థానిక వై.సి.పి.క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ కు ఎందుకంత భయం అని, వాలంటీర్లను కించపరచడం తగునా అంటూ ధర్మశ్రీ ప్రశ్నించారు. నియోజకవర్గ పార్టీ పరిశీలకులు బొడ్డేటి కాశీ విశ్వనాథ్ తో కలసి మాట్లాడుతూ… వాలంటీర్లను చూస్తే చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడ తున్నాయని కాబట్టే వాలంటీర్లపై చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలతో పాటు దత్తపుత్రుడి నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడుతున్నాయని మండిపడ్డారు. వాలంటీర్లంటే గౌరవ భృతి తో కలిసి పనిచేసే స్వచ్ఛంధ సేవకులు అని, ప్రజలకు సేవ చేస్తున్న వారిపై కక్ష్య సాధింపు తగదన్నారు. మహిళల అదృశ్యానికి, ప్రజలు గెద్ద కాళ్ల కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారని వాలంటీర్లను బహిరంగంగా కించపరచడం వారి నైజానికి నిదర్శనం అని తెలిపారు.
తమకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగ్గొడతాను అని చెప్పడం వెనుక వాలంటరీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తామని చెప్పకనే చెబుతున్నారని అన్నారు. అలాగే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల కథ తేలుస్తాం అని బెదిరింపులకు దిగుతున్నారని, విపక్షాల జేబులు నిండడం లేదు కాబట్టే వారి కడుపులు మండుతున్నాయని మండిపడ్డారు.
ఈరోజు వై.సి.పి. ప్రభుత్వం లో ఎటువంటి పక్షపాతం లేకుండా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అంద జేయ బట్టే వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నారు.
టీడీపీ వారి కడుపులు ఎందుకు మండుతున్నాయంటే.. గతంలో మాదిరిగా పార్టీ పెద్దల జేబులు నిండటం లేదు కాబట్టే, వారు మండి పడుతున్నారన్నారు. ప్రధానంగా ప్రజల కడుపులు, అందులోనూ పేద వర్గాల ఖాతాలు నిండుతున్నాయి, కాబట్టే టి.డి.పి. మహా కూటమి కడుపు మండిపోతుందని వ్యాఖ్యానించారు. అందుకే వాలంటీర్లపై అక్కసు వెళ్లగక్కుతూ… నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.
వాలంటీర్లను ఉగ్రవాదులు, జిహాదీలు, స్లీపర్‌ సెల్స్‌తో పోల్చుతూ అత్యంత అవమానకరంగా మాట్లాడుతూ.. ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లు రూ.5వేల రూపాయిల గౌరవ వేతనంతో సమాజంలో నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నారని, కోవిడ్‌ మహమ్మారి సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కూటమి పెద్దలు హాయిగా నిద్రపోతూ, ఇళ్లకే పరిమితమైతే… ఇదే వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకూ సేవలందించారని గుర్తు చేశారు. అంత గొప్ప సేవ చేసిన వీరిపై టీడీపీ నేతలు ఈ రకంగా మాట్లాడ్డం సిగ్గుచేటన్నారు.
గత తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీలకు విరుద్ధంగా…. కులం, మతం, ప్రాంతం చివరకు ఏ పార్టీ అన్న విషయం కూడా చూడకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తున్న వాలంటీర్లను చూసి తెలుగుదేశం పార్టీ నేతలకు కంటగింపుగా ఉందని, అందుకే పదే, పదే వాలంటీర్లపై నోరుపారేసుకుంటున్న టీడీపి నేతలు, తాము అధికారంలోకి వస్తే తిరిగి జన్మభూమి కమిటీల అరాచకానికి తెర తీస్తామని చెప్పకనే చెబుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.5 లక్షల మంది వాలంటీర్లపై నోరు పారేసుకోవడం ద్వారా… టీడీపి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వారి కుటుంబాలపైనా దాడికి దిగుతున్నారని. తద్వారా రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్న వాలంటీర్ల కుటుంబాలకు చెందిన దాదాపు 10లక్షల మందిపై నేరుగా దాడి చేస్తున్నారని అన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా, ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలకు సేవ చేయడం టెర్రరిజం కాదనీ, జన్మభూమి కమిటీల వలే కాకుండా నేరుగా వయస్సు మళ్లిన వాళ్లకు ఇంటి దగ్గరకే వెళ్లి తలుపుతట్టి పెన్షన్‌ అందించడం మమ్మూటికీ జిహాదీ కాదన్నారు. కోవిడ్‌ లాంటి మహమ్మూరి సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించిన వాలంటీర్లును స్లీపర్‌ సెల్స్‌తో పోల్చడం దారుణమన్నారు. వాలంటీర్లపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు, తమ వ్యాఖ్యలను వెనక్కితీసుకోవడంతో పాటు వాలంటీర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యే డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు, రైల్వే బోర్డు సభ్యులు బొడ్డు శ్రీరామమూర్తి, జిల్లా వైసీపీ మహిళా విభాగం ప్రతినిధి బగ్గు శ్యామల , టెలికం డైరెక్టర్ వేచలపు ప్రకాష్, మాజీ జడ్పిటిసి బి. సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ మొల్లి సోమనాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img