Friday, May 17, 2024
Friday, May 17, 2024

స్ట్రాంగ్ రూమ్ లు, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలి

ఎన్నికల సాధారణ పరిశీలకులు మనీష్ సింగ్, సి.అజయ్ నాథ్ ఝ
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : సాధారణ ఎన్నికలు – 2024 కోసం నగరంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్ లు, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు మనీష్ సింగ్, సి.అజయ్ నాథ్ ఝ, పోలీస్ పరిశీలకులు రవి కుమార్ ఆదేశించారు.
మంగళవారం అనంతపురం నగరంలోని జేఎన్టీయూలో సాధారణ ఎన్నికలు – 2024 దృష్ట్యా జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ లు, రిసెప్షన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి, జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ లతో కలసి గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనీష్ సింగ్ , అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం, జిల్లాలోని రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు సి.అజయ్ నాథ్ ఝ , అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల పోలీస్ పరిశీలకులు రవి కుమార్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ, పోలీస్ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను అనుసరించి స్ట్రాంగ్ రూమ్ లు, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. సరైన విధంగా బ్యారికేడింగ్, లైట్లు, ఫ్యాన్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్ లు, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు. పోలింగ్ పూర్తి అయ్యాక ఆయా నియోజకవర్గాల నుంచి స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎంలను తరలించే బస్సులు వచ్చివెళ్లేందుకు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలన్నారు. వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ లు, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు. అన్ని రకాల ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ సూచనల మేరకు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు జేఎన్టీయూలోని కాన్ఫరెన్స్ హాల్లో సర్వీస్ ఓటర్ రిజిస్ట్రేషన్ మరియు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టం (ETPBMS) గురించి జిల్లా కలెక్టర్, ఎన్ఐసి డిఐఓలు ఎన్నికల సాధారణ, పోలీస్ పరిశీలకులకు పూర్తిగా వివరించారు. మంగళవారం మధ్యాహ్నంలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, అడిషనల్ ఎస్పిలు విజయభాస్కర్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, రిటర్నింగ్ అధికారులు రాణిసుస్మిత, కరుణకుమారి, వి.శ్రీనివాసులు రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, జి.వెంకటేష్, వసంతబాబు, వెన్నెల శ్రీను, డీఎస్పీ వీర రాఘవరెడ్డి, ఆర్అండ్బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, తహసీల్దార్ శివరామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img